Monday, December 23, 2024

జల కాలుష్యం ప్రాణాంతకం

- Advertisement -
- Advertisement -

నగరాల్లో సురక్షిత మంచినీటి సరఫరా ఒక సవాలుగా మారింది. వాడుకగా వచ్చే వ్యర్థ జలాల ప్రక్షాళన సరిగ్గా జరగకపోవడంతో ఆ జలాలన్నీ మంచి నీటి వనరుల్లో నదుల్లో కలిసి కలుషితం చేస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో కలుషిత నీటి సమస్యకు భయపడి దూరాన ఉన్న గోదావరి నదినుంచి పైపులైన్ల ద్వారా నీటిసరఫరాకు ‘భగీరథ’ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వేసవి రాకముందే హైదరాబాద్ నగరంలో మల్కాజిగిరి, ఆనంద్‌ బాగ్ వంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ప్రారంభం కావడం గమనార్హం. నీటి సరఫరా జరిగే ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్య పీడిస్తోంది.పైపుల లీకేజీతో మంచినీరు కూడా కలుషితమై విషతుల్యమవుతోంది. చెన్నైలోని సబర్బన్ ప్రాంతం పల్లవరంలో ఇటీవల తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి మంచినీటి వ్యవస్థ దెబ్బతింది. పైపుల ద్వారా వచ్చే కలుషిత నీరు ముగ్గురి ప్రాణాలను బలిగొనడం, మరో 34 మంది ఆస్పత్రిపాలు కావడం అత్యంత శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారానే పైపుల ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. అయితే ఆ ప్రాంత ప్రజలు శుచి, శుభ్రతను పాటించకపోవడం వల్లనే ఇలా జరిగిందని తమిళనాడు రాష్ట్ర మంత్రి ఒకరు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమే. దేశంలోని పట్టణాల్లో కలుషిత జలాలు సరఫరా అవుతుండటం తీవ్ర సమస్యగా ఉంటోంది. ఈకోలి బ్యాక్టీరియా అత్యధిక శాతం నిండి ఉన్న నీటిని తాగడం వల్లనే భారీ ఎత్తున ప్రజలు అస్వస్థులైన సంఘటనలు గత ఆరు నెలల్లో బెంగళూరు, కొచి, నొయిడా, విజయనగరం, నగరాల్లో సంభవించాయి.

రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లోని నీటిలో ఈకోలి బ్యాక్టీరియా విస్తరించి ఉన్నట్టు పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే. బతుకుతెరువు కోసం నగరాలకు వలసవచ్చే వేలాది మందికి కనీసం తాగడానికి మంచినీళ్లు, వాడుక నీరు పోడానికి డ్రైనేజీ సౌకర్యం వంటి కనీస సదుపాయాలు సమకూర్చలేని దుస్థితిలో నగరాలు ఉంటున్నాయి. ఉష్ణమండల దేశమైన భారత్ వంటి దేశాల్లో సురక్షిత తాగు నీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. జలశక్తి మంత్రిత్వశాఖ డేటా ప్రకారం దేశంలోని 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, అలాగే 27 రాష్ట్రాల్లోని 469 జిల్లాల్లో ఫ్లోరైడ్ వంటి హానికరమైన మూలకాలు బయటపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 1.7 బిలియన్ మంది మలమూత్రాలమయమైన నీటినే తాగునీటిగా వాడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో వెల్లడించింది.

ఫలితంగా డయేరియా వంటి వ్యాధులు ప్రబలి ప్రపంచం మొత్తం మీద ఏటా మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సురక్షితమైన నీటిని, పారిశుద్ధ సౌకర్యాలను పొందడం మానవ హక్కుగా 2010లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మరో ముఖ్యమైన సమస్య భూగర్భ జలాలు రసాయనాల కలుషితం కావడంకూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సమస్యను గుర్తించారు. తమిళనాడు పదేళ్ల విజన్‌లో తమిళనాడు అభివృద్ధికి చేపట్టనున్న ఏడు ప్రాధాన్య అంశాలను వివరించారు. అందులో మంచినీటి సమస్య కూడా ప్రస్తావించారు. తాగునీటి సరఫరా తలసరి వాటా 9 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. నీటి వృథాను 50% నుంచి 15 శాతానికి తగ్గిస్తామన్నారు. వాడుక నీటిని రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించగలిగేలా చేస్తామన్నారు. ఆ నీటిసరఫరా 5% నుంచి 20 శాతానికి పెంచుతామన్నారు.

ఇప్పుడు సురక్షిత మంచినీటిని సరఫరా చేయడమే ఆయనకొక సవాలుగా మారింది. ఒడిశాలో 20172022 మధ్య కాలంలో 42 లక్షల మంది కలుషిత నీటితో డయేరియా, టైఫాయిడ్‌ల బారిన పడ్డారు. అంటే ఒడిశా రాష్ట్ర జనాభాలోని పదోవంతు మంది కలుషిత నీటి వల్లనే తీవ్రవ్యాధుల బారినపడవలసి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, సూయెజ్ మేనేజ్‌మెంట్ పరిశీలించగా కనీసం 42.23 లక్షల మంది ఎక్యూట్ డయేరియా డీసెంట్రీ (ఎడిడి)కి, మరో 4.62 లక్షల మంది టైఫాయిడ్‌కు గురయ్యారని ప్రజారోగ్యశాఖ తాజాగా సమర్పించిన నివేదికలో వెల్లడైంది. ఐదు జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన జల్‌జీవన్ మిషన్ పథకం దేశం మొత్తం మీద 15.32 కోట్ల గ్రామీణ కుటుంబాలకు వర్తింపచేయాలన్న లక్షం పెట్టుకున్నారు.

ఈ పథకంలో మొత్తం లబ్ధిదారుల్లో 79% మందికి పైపుల ద్వారా ఇంటికే మంచినీళ్లు అందిస్తారు. ఇందులో ఒడిశా వాటా 75 శాతం. పథకం లక్షం ఉత్తమంగా ఉన్నా దానిని సరిగ్గా నిర్వహించలేకపోవడమే అసలు సమస్య. అర్బన్, రూరల్ ఏరియాల్లో మురుగు నీటి పారుదల సౌకర్యం లోపించడం. వ్యర్థ జలాల ప్రక్షాళన సరిగ్గా జరగక పోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పాటు పరిశ్రమల కాలుష్యాలు నీటివనరులు, నదుల్లోకి వచ్చి కలుస్తున్నాయి. భారమైన లోహాల మూలకాలున్న ప్రమాదకరమైన నీటితోనే కూరగాయలను పండించడం కూడా వ్యాధులకు దారి తీస్తోంది. దీనికి ఉదాహరణగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మూసీ కలుషిత జలాలతో కూరగాయల సాగు జరుగుతోందని అధ్యయనాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News