Friday, December 27, 2024

నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి అంగీకరించిన సిఎం కెసిఆర్‌కు రైతాంగం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలని, గతంలో సాగునీటి కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగు కోసం కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. రైతు బాంధవుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు వానాకాలం పంట సాగుకోసం నీటిని విడుదల చేశామన్నారు.

1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, నిజాంసాగర్ ఆయకట్టు కింద జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో అలీసాగర్ వరకు ఉన్న మొదటి ఫేజ్‌లోని 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉందని, వానాకాలం పంటల సాగుకు మొత్తం 10 టీఎంసీలు అవసరముంటుందన్నారు. వర్షాలు కురిసి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోతే సింగూరు, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి అవసరమైన 5 టీఎంసీల నీటిని విడుదల చేయమని సిఎం అధికారులకు ఆదేశించారన్నారు. వానాకాలం పంట సాగుకు ఇబ్బంది లేదన్నారు. విడతలుగా మొత్తం ఆరు తడులలో నీటిని అందిస్తామన్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీలకు సామర్థం మేరకు చివరి ఎకరాకు కూడా నీళ్లు చేరే విధంగా సాగునీటి, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నీటిని అందిస్తామన్నారు.

రైతులు నీటిని వృధా చేయకుండా అవసరమైన మేరకు పొదపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకుని నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, శాసన సభ్యులు హన్మంత్ సిండేతో కలిసి నిజాంసాగర్ నీటిని విడుదల విషయాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే అంగీకరించారన్నారు. గతంలో సాగునీరు వదలాలంటే సీఎంల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే వాళ్లమన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నవంబర్ నెలలో వచ్చే తుఫాన్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి వానాకాలం పంట సాగును ముందుకు జరుపుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు కూడా సహకరించి ముందస్తుగా నాట్లు వేసుకోవాలన్నారు.

వానాకాలం ముందస్తుగా నాట్లు వేసుకుంటే అక్టోబర్ నెలలో కోతలకు వస్తాయని, యాసంగి కోసం నవంబర్‌లో వేసుకుంటే మార్చిలో కోతలకు వస్తాయన్నారు. వ్యవసాయ సాగునీటి రంగాలలో 70 ఏళ్లలో సాధించని ప్రగతిని గత ఏడు ఏళ్లలో సాధించామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా దానికి అనుబంధంగా రిజర్వాయర్లు నిర్మించడం, వెంటనే కాల్వలను తవ్వడంతో ఫలితాలు త్వరితంగా వస్తున్నాయన్నారు. బీడు భూములకు సాగునీరు అందుతుందని, ఫలితంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భాగా పెరిగిందన్నారు.

ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్‌మిల్లుల కెపాసిటి సరిపోవడం లేదన్నారు. అందుకే 2 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నూతనంగా రైస్‌మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బాన్సువాడ ప్రాంతంలో కూడా పెద్ద వరి ధాన్యం మిల్లు ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యంగా, అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి వస్తే రైతులకు భవిష్యత్తులో ఇబ్బందులుండవన్నారు. రైతులకు లాభాలు ఎక్కువగా వస్తాయన్నారు. వరి ధాన్యాన్ని ఎగుమతి చేయలేమని, బియ్యం ఎగుమతి చేయవచ్చన్నారు. రాష్ట్ర అవసరాలకు నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోతుందని, మిగిలినది ఎగుమతి చేయాల్సి ఉంటుందన్నారు.

దేశంలోని మిగతా రాష్ట్రాలు తమకు బియ్యం ఎగుమతి చేయమని మనలను అడుగుతున్నారన్నారు. మన దగ్గరలో కూడా ఎప్పటికప్పుడు బియ్యాన్ని ఎగుమతి చేస్తే గోడౌన్లు ఖాళీ అయ్యి వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News