యాసంగిలో చివరి ఆయకట్టు వరకు సాగు కు నీరు అందించాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అద్యక్షతన ఇరిగేషన్ శాఖ అధికారులు , గుత్తేదారులతో జిల్లాస్థాయి ఇరిగేషన్ అడ్వైజరి బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్దిని సాధించిందని, కరీంనగర్ జిల్లాలోని 11 మండలాల్లో 1,31,768 ఎకరాల విసీర్ణంతో ఉన్న కాకతీయ కాలువ ద్వారా సాగు నిర్వహించడం జరుగుతుందని సూచించారు.
రభీ , యాసంగి పంటకాలంలో డి 83, 86 కెనాల్లద్వారా దిగువకు నీటిని విడుదల చేసేముందు ఓవర్ ఫ్లో వలన రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తుగా సమీక్షించుకోవాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరతగతంగా పూర్తిచేయాలని, నీటి అవసరం ఉన్నచోట ఓటి లను ఏర్పాటు చేసినీటి తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిచే గుత్తేదారులపై కఠనంగా వ్యవహరించాలని అన్నారు. అచ్చంపేట నుండి నాగులమల్యాల వరకు చేపట్టిన ఫీడర్ చానల్ పనులను జనవరి 31 లోగా పూర్తిచేయాలని, 16 ½ కి.మి. మేర చేపట్టిన లెఫ్ట్ కెనాల్ పనులను జనవరి 31లోగా పూర్తిచేయాలని అన్నారు.
288.52 లక్షల అంచనాలతో జిల్లాలో 108 ఓటి ల నిర్మాణాలను ప్రారంభించగా ఇప్పటివరకు 64ఒటీల నిర్మాణాలను పూర్తిచేసుకోవడం జరిగిందని, నిర్మాణాల కొరకు అదనపు నిధులు అవసరం ఉన్నచోట ప్రతిపాధనలను సిద్దం చేసి పంపించాలని పేర్కొన్నారు. అదేవిధంగా నాగులచెరువు, బద్దిపెల్లి చెరువులను ఒటిల ద్వారా నింపాలని సూచించారు. కెనాల్ నిర్మాణ పనులలో ఎదురయ్యే భూసంబంధిత, ఆర్థిక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మానకొండూర్, చోప్పదండి మరియు హుస్నాబాద్ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకూడదని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న కెనాల్, ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోని, చెరువులు, కుంటలు నీటితో జలకళను సంతరించుకోవాలని తెలిపారు.
చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేలా ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు. చెరువు ప్రాంతాలను ఆక్రమించిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని, చెరువులను కాపాడాలని అన్నారు. యాసంగి,రబీ సీజన్ 2022-23 లో 22,037 ఎకరాలకు మరియు ఎల్ ఎమ్ డి ద్వారా 104307 ఎకారాలకు ఎస్సారెస్పి ద్వారా దిగువకు నీరు అందించాలని, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 36618 ఎకరాలకు నీరు అందాలని సూచించారు.
జిల్లాలో 23 చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టగా 90శాతం కంటే ఎక్కువ పనులను ఇప్పటికే పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయ ఫెస్1 నుండి ఫెస్ 4 వరకు 554 పనులు చేపట్టగా నేటి వరకు 458 పనులు పూర్తిచేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మానకొండూర్, చోప్పదండి, హుస్నాబాద్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, సంతోష్ కుమార్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.