Thursday, January 23, 2025

ముంపు తేల్చకుండానే నీటి నిల్వా?

- Advertisement -
- Advertisement -

పోలవరం బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వేపై ఉలుకూపలుకూలేని కేంద్రం

ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తొలి దశకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మోడీ సర్కార్

జలాశయంలో నీటి నిల్వకు తొలగిన అడ్డంకులు

ముంపు సమస్యపై తెలంగాణలో కలవరం

తొలిదశ నీటి నిల్వపై పెరుగుతున్న భయాందోళనలు

మన తెలంగాణ/ హైదరాబాద్ :  గోదావరి నది పై అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకంపనలు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నా యి. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తొలిదశకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో పోలవరం జలాశయంలో నీటి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రాజెక్టులో 45.72మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆ పరిధిలోని కాం టూర్ కింద 36గ్రామాలు నీటిమునకకు గురికానున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేయించి వారికి పునరావాస వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కూడా విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. తొలిదశలో భాగంగా పోలవరం రిజర్వాయర్‌లో నీ టిని నిలువ చేస్తే కలిగే పరిణామాల పట్ల తెలంగాణ ప్రజల్లో ఆందోళన పుట్టుకొస్తోంది. గత ఏడాది గోదావరి నదిలో భద్రాచలం వద్ద నీటిమట్టం 70అడుగులకు చేరినప్పుడే నది పరీవాహకంగా ఉన్న అనేక గ్రామాలు నీట మునిగాయి. సుమారు 28వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆకస్మికంగా లోతట్టు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సివచ్చింది.

వర్షాకాలం సాగు చేసిన సుమారు40వేల ఎకరాల్లో వివిధ రకాల పం ట పొలాలు రోజుల తరబడి గోదావరి వెనుక జలాల్లో నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాకుండా తెలంగాణ రా్రష్ట్ర ప్ర భుత్వం ఆధునాత సాంకేతికతను ఉపయోగిం చి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కూడా పోలవరం వెనుక జలా ల ప్రభావానికి గురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్‌లోకి గోదావరి నదీ జలాలు ప్రవేశించాయి. భారీ మోటార్లు నీట మునిగాయి. పంపుహౌస్‌కు భారీ నష్టం వాటిల్లింది. వీటిని తిరిగి పునరుద్ధరించుకునే సరికి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. ఈ పరిస్థితులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసిన నీటి పారుదల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాలని కేంద్ర జలశక్తి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వెనుకజలాలపై ఉమ్మడి సర్వే చేయించలేదు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్ర భూభాగంలో జరిగే నష్టాలను వీలైనంత తక్కవకు తగ్గించే అవకాశాలను అన్వేషించి అ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ వస్తోంది. వర్షాకాలం గోదావరి నదిలో వరద ప్రవాహాలను దృష్టిలో పోలవరం ప్రాజెక్టు గేట్లు వర్షాకాలం మూసి వుంచరాదని సూచించింది. వర్షాకాలం ముగిసాకే ప్రాజెక్టు గేట్లు ఆపరేట్ చేసుకోవాలని సూచించింది. ఈ అంశంపైన కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొలిదశ పనులు పూర్తికి కేంద్రం నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేస్తున్న చర్యల పట్ల తెలంగాణలోని గోదావరి బ్యాక్ వాటర్‌ప్రభావిత ప్రాంత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి స్థాయి నీటినిల్వ 194.6 టిఎంసిలు
గోదావరి నదిపై నిర్మించిన పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటి నిలువ సామర్థం 194.6 టిఎంసిలు కాగా, గరిష్ట స్థాయి నీటిమట్టం 45.72మీటర్లు. ఈ స్థాయిలో నీటిని నిలువ చేస్తే బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో నీటిముంపు సమస్యపై ఇప్పటివరకూ సమగ్రమైన అధ్యయనం జరపలేదన్న విమర్శలు వస్తున్నాయి. రిజర్వాయర్‌లో 150అడుగుల స్థాయిలో నీటిని నిలువ చేస్తే తెలంగాణ రాష్ట్ర భూభాగంలో 899 ఎకరాలు మాత్రమే నీట మునుగుతుందని కేంద్ర జలసంఘం లెక్కతేల్చింది. దీనిపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలసంఘం గోదావరి వెనుక జలాలపైన సమగ్రంగా ఉమ్మడి సర్వే నిర్వహించి రాష్ట్రంలోని గోదాదవరి నదీపరివాహక ప్రాంత ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. వరదల సమయంలో భద్రాచలం తదితర లోతట్టు ప్రాంతాలు వరద నీటి ముంపునకు గురికాకుండా కరకట్టల నిర్మాణాలతో పాటు తగిన రక్షణ చర్యల బాధ్యతను కూడా చేపట్టాలంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News