89 కాలనీలకు ఏప్రిల్ రెండో వారంలో తాగునీరు అందించాలి
పనుల్లో వేగం పెంచాలని, అధికారులకు, నిర్మాణ సంస్దలకు ఆదేశాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఓఆర్‌ఆర్ ఫేజ్2 పనుల్లో వేగం పెంచాలని జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశించారు. వచ్చే నెలలో మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించిన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే లక్షంతో పనులు జరగాలని ఆయన అధికారులు, నిర్మాణ సంస్ద ప్రతినిధులకు సూచించారు. గురువారం కీసర, ఘట్‌కేసర్ మండలాల్లోని కొకకోలా కాలనీ, రామకృష్ణాపురం, అయ్యప్పకాలనీ, అన్నోజిగూడ, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో ఓఆర్‌ఆర్ ఫేజ్2లో పనుల్లో భాగమైన ఫ్యాకేజీ1లో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. చౌదరిగూడలో పైప్‌లైన్ విస్తరణ పనుల పురోగతి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజ్1లో మొదటి ప్రాధాన్యతగా నిర్ణయించిన 89 కాలనీలకు ఏప్రిల్ రెండోవారంలో నీటిని సరఫరా చేయాలని ఈదిశగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇందుకు 171 కిమీ పైప్‌లైన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం సరిపడా పైపులు, స్పెషళ్లు, యంత్రాలు, కార్మికులు ఉండేలా చూసుకోవాలని నిర్మాణ సంస్దను ఆదేశించారు. ఇన్‌లెట్, అవుట్‌లెట్, డిస్ట్రిబ్యూషన్ పనులను ప్రాధాన్యతపరంగా జరిపించాలని పేర్కొన్నారు. అలాగే రిజర్వాయర్ల నిర్మాణంలో ప్రతి దశను పూర్తి చేయడానికి నిర్ధేశిత తేదీలను లక్షంగా పెట్టుకోవాలని, ఆతేదీ నాటికి ఆదశను పూర్తి చేయాలని సూచించారు. ఈమొత్తం ప్రణాళికను సిద్దం చేసి వెంటనే సమర్పించాలని సూచించారు. నిర్మాణ దశలో ఉన్న రిజర్వాయర్ల వద్ద తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఓఆర్‌ఆర్ ఫేజ్ 2 వివరాలు: ఔటర్‌రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామపంచాయితీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మంచినీటిని అందించేందుకు రూ. 1200 కోట్లతో ఓఆర్‌ఆర్ ఫేజ్ 2 పనులను జలమండలి చేపట్టింది. ప్యాకేజ్ 1లో రూ. 613 కోట్లు, ఫ్యాకేజ్ 2 కింద రూ.587 కోట్లతో జలమండలి ఈపనులు చేపట్టింది.
ఓఆర్‌ఆర్ ఫేజ్2లోని ఫ్యాకేజ్ 1 వివరాలు: ఫ్యాకేజ్1లో మొత్తం 65.5 ఎంఎల్ సామర్దం కలిగిన 34 రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. 1571 కిమీ కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈపనులు పూర్తైతే కొత్తగా 87,293 ఇళ్లకు నల్లా కనెక్షన్ అందుతుంది. ఘట్‌కేసర్, కీసర, సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో ప్యాకేజ్1 పనులు జరుగుతున్నాయి. ఇందులో మొదటి ప్రాధాన్యతగా 86 కాలనీలకు ఏప్రిల్ రెండోవారంలో నీటిని సరఫరా చేయాలని జలమండలి నిర్ణయించింది. ఇందుకు 171కిమీ పైపులైన్ నిర్మిస్తోంది.