Friday, December 20, 2024

త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటి ట్రయల్ రన్..

- Advertisement -
- Advertisement -

Water Trial Run for Gouravelli Project Soon: Vinod Kumar

మనతెలంగాణ/హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ట్రయల్ రన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ప్రభుత్వ ఇంజనీరింగ్ సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్‌లతో కలిసి వినోద్‌కుమార్ సందర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతవాసులకు దశాబ్దాల సాగునీటి కల త్వరలోనే సాకారం కానుందని అన్నారు. గోదావరి జలాలతో హుస్నాబాద్ సెగ్మెంట్ బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేర్, అక్కడి నుంచి తోటపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్‌కు నీరు చేరుతుందని, భారీ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 1.141 టిఎంసి మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రి కెసిఆర్ రీ-డిజైన్ చేయడంతో ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 8.3 టిఎంసిలకు పెరిగిందన్నారు. ఈ నీటితో లక్ష ఎకరాలకు సాగు చేసే ఆస్కారం కలిగిందన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్‌హౌస్ 130 మీటర్ల లోతులో, 17 మీటర్ల వెడల్పు, 85 మీటర్ల పొడవుతో నిర్మించారని ఆయన తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 16వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వినోద్‌కుమార్ తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని 15 గ్రామాలకు, కోహెడ మండలంలోని ఎనిమిది గ్రామాలకు, చిగురుమామిడి మండలంలో 10 గ్రామాలకు, భీమదేవరపల్లి మండలంలో 12 గ్రామాలు, ధర్మసాగర్ మండలంలో 13 గ్రామాలు, ఘన్‌పూర్ మండలంలో 10 గ్రామాలు, సైదాపూర్ మండలంలో మూడు గ్రామాలు, హనుమకొండ, జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని ఐదు గ్రామాలకు సాగునీరు అందుతుందని వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా సాగునీటి రంగం తీవ్ర అన్యాయానికి గురి అయిందన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పట్టుదలతో దూరదృష్టితో, పరిపాలనా దక్షతతో సాగునీటి రంగం చరిత్ర సృష్టించిందని వినోద్‌కుమార్ వివరించారు. సిఎం కెసిఆర్ కృషి ఫలితంగా గౌరవెల్లి ప్రాజెక్టు రికార్డ్ సమయంలో పూర్తి అవుతోందని ఆయన తెలిపారు.

Water Trial Run for Gouravelli Project Soon: Vinod Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News