ఫెంగల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు చెన్నై నగరంతోపాటు పొరుగున ఉన్న జిల్లాలలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలలో ఆసుపత్రులు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోగా నీటి ప్రవాహాన్ని మళ్లించడానికి మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నారు. రోడ్లపైన ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారికేడ్లు, గొడుగులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. సముద్ర తీరం సమీపంలో ప్రాంతాలలో ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. అననుకూల వాతావరణం కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మూసివేశారు. 100కి పైగా విమానాల రాకపోకలు రద్దు కాగా శనివారం 19 విమానాలను సమీపంలోని విమానాశ్రయాలకు మరలించినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం అనుకూలంగా లేని కారణంగా 20 విమానాలను హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దు చేయగా మరో కొన్ని విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్లించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లవలసిన 3 విమానాలు రద్దయ్యాయి.
అదే విధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే 7 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా..తుపాను కారణంగా భారీ అలలు విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున సముద్రం వద్దకు వెళ్లవద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించినప్పటికీ చెన్నైలోని మెరీనాతోపాటు మహాబలిపురంలోని ప్రపంచ వారసత్వ సంపద వద్ద కూడా సందర్శకుల తాకిడి అధికంగా ఉండడం విశేషం. విల్లుపురం జిల్లాలోని మరక్కనం వంటి తీర ప్రాంతాలలో ఈదురుగాలుల తీవ్రత బలంగా ఉంది. చెన్నైలోని క్రోమ్‌పేట వద్ద ఉన్న రెండు ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణాలలోకి వర్షపునీరు ప్రవేశించడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొరట్టూర్, వేలచ్చేరి, మడిపాక్కం, హస్తినాపురం, తిరుమలై నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వర్షపునీరు ప్రవేశించడంతో ప్రజలు తమ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లను కాపాడుకునేందుకు వాటిని మంచాలపై చేర్చారు. ఒక ఎటిఎం సెంటర్‌లో డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఒక వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు తెలిసింది. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వరద చేరుకుంటుండడంతో చెంబరంభాక్కం జలాశయం సముద్రాన్ని తలపిస్తోంది.