Tuesday, September 17, 2024

ప్రకృతి ప్రళయం

- Advertisement -
- Advertisement -

ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా భాసిల్లే కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ఆ ప్రకృతే వికృతై ప్రళయం సృష్టిస్తోంది. వయనాడు జిల్లాలో చోటు చేసుకున్న పెను ఉత్పాతం మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు కొండచరియలు విరిగిపడి 350 మందికి పైగా ప్రాణాలు హరిస్తే, కొన్ని వందల మంది ఆచూకీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కూడా తెలియరావడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా, శిథిలాల కింద చిక్కుకున్నవారి ఆర్తనాదాలు వినబడుతున్నా రక్షించేందుకు వీలులేని భయానక పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొని ఉంది.

ఎన్ డిఆర్‌ఎఫ్ దళాలు, సైనిక బలగాలు అహోరాత్రులు శ్రమిస్తున్నా, పరిస్థితి ఒక కొలిక్కి రావడం లేదు. భారీ వర్షాల కారణంగా అర్థరాత్రి విరిగిపడిన కొండచరియల కారణంగా మండక్కై, చురాల్ మల, అట్టామల, నూల్పుజా గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా, బురదలోనూ, శిథిలాల కింద చిక్కుకుని వందలమంది సజీవ సమాధి అయిపోయారు. మరికొందరి మృతదేహాలను సమీపంలోని మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతుండగా కనుగొన్నారు. ప్రపంచంలోనే కొండచరియల ఉత్పాతాలు సంభవించే దేశాల జాబితాలో ఇండియాది ఐదోస్థానం. కశ్మీర్ నుంచి కేరళ వరకూ గతంలో కొండ చరియలు విరిగిపడి వందలాది మంది బలైపోయిన సంఘటనలు అనేకం. మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, కేరళ, జమ్మూకశ్మీర్, అసోం తదితర రాష్ట్రాలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. పశ్చిమ కనుమలు ఆవరించి ఉన్న కేరళలోని అనేక భూభాగాలను పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన ప్రాంతాలుగా పరిగణిస్తారు.

ఇలాంటి చోట్ల పర్యావరణ సమతుల్యత లోపించినప్పుడు వయనాడులో సంభవించిన పెను ఉత్పాతాల వంటివి చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. ఆగ్నేయ అరేబియా మహాసముద్ర ఉపరితలం ఇటీవలి కాలంలో వేడెక్కుతోందనీ, దీని వల్ల పశ్చిమ కనుమలున్న ప్రాంతంలో వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే వయనాడు విషాదానికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. వయనాడులో సంభవించిన తాజా విపత్తుకు ఇటీవలి కాలంలో ఉధృతమైన రబ్బర్ ప్లాంటేషన్ కూడా కారణమన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. రబ్బరు మొక్కలకు భూక్షయాన్ని ఆపే గుణం లేదన్నది వారి వాదన. వయనాడు చరిత్రను పరికించి చూస్తే ప్రకృతి ప్రకోపాలకు ఈ ప్రాంతం కేంద్రంగా మారిందని నమ్మక తప్పదు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి చెట్లతో నందనవనాన్ని తలపించే వయనాడు నేడు తన సహజసిద్ధమైన రూపురేఖలను కోల్పోయింది.

గత అరవయ్యేళ్లలో ఈ ప్రాంతంలో 62% పచ్చదనం హరించుకుపోయిందంటూ 2022లో వెలుగుచూసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒకప్పుడు వయనాడు జిల్లాలోని 85 శాతం భూభాగం అటవీప్రాంతమే. పర్యాటకాభివృద్ధి పేరిట కొండలను తొలిచి రోడ్లను నిర్మించడం, పచ్చటి చెట్లను కొట్టివేసి భవంతులు, వంతెనలు నిర్మించడంతో ఇక్కడ పర్యావరణం పూర్తిగా దెబ్బతింది. కొండల ప్రాంతాల్లో క్వారీలు, గ్రానైట్ తవ్వకాలు ఇటీవలి కాలంలో ఊపందుకోవడం కూడా ప్రకృతి విలయాలకు కేరళ కేంద్ర బిందువుగా మారడానికి ఒక కారణం. పర్యవసానంగా వయనాడు సహా చుట్టుపక్కల జిల్లాలలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కేరళలో ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు 400 మందికి పైగా అసువులు బాశారు. గత పదేళ్లలో కేరళ ప్రకృతి విలయాలకు చిరునామాగా మారడానికి కారణం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే.

ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్‌లో 1998లో కొండచరియలు విరిగిపడి మాల్పా అనే గ్రామం తుడిచిపెట్టుకుపోయిన ఉదంతం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వర్షాలు, వరదల గురించి వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం మామూలే. కానీ కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందస్తుగా పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని నార్వే, హాంకాంగ్ వంటి దేశాలు అందిపుచ్చుకుని ప్రకృతి విలయాలకు కొంతవరకైనా ముకుతాడు వేయగలుగుతున్నాయి.

ఈ విషయంలో ఇండియా వెనుకబడి ఉండటం శోచనీయం. ప్రకృతిని పట్టించుకోకుండా పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే ఎలాంటి పెను ప్రమాదాలు సంభవిస్తాయో చెప్పడానికి వయనాడు ఉదంతం ఒక మచ్చుతునక. సంతోషకరమైన, ఆహ్లాదభరితమైన మానవ జీవనం కొనసాగేందుకు పర్యావరణ సమతుల్యత ముఖ్యమనే విషయాన్ని పాలకులు సైతం గ్రహించాలి. అభివృద్ధి పేరిట సహజసిద్ధమైన అడవులను నరికివేస్తూ, కొండాకోనలను తొలచివేస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడితే పెను ఉత్పాతాలకు దారితీస్తుందనే విషయాన్ని గ్రహించి మసలుకుంటే అందరికీ మంచిది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News