Wednesday, January 22, 2025

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ తుక్కుగూడ సభలో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా

మన తెలంగాణ/హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధంగా వున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎంఐఎం, టిఆర్‌ఎస్ సర్కార్‌ను చూసి భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. శనివారం తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పారని, ఎంఐఎంకు భయపడి విమోచన దినాన్ని పక్కనబెట్టారని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎంఐఎం , టిఆర్‌ఎస్ సర్కార్‌ని ఒకేసారి పంపించేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో వుందని, ఇలాంటి ప్రభుత్వం మీకు అవసరమా? అని అమిత్ షా ప్రశ్నించారు.

ఆయుష్మాన్‌భవను తెలంగాణలో అమలు చేయట్లేదని, సైన్స్ సిటీ కోసం భూమి ఇవ్వలేదని, వరంగల్‌లో సైనిక్ స్కూల్ కోసం భూమి కేటాయించలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లలో కేంద్రం రూ.2 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని… డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ సర్కార్‌ని మార్చడానికి బండి సంజయ్ ఒక్కరు సరిపోతారన్నారు. సంజయ్ ప్రసంగం విన్న తర్వాత ఇక్కడికి తాను రావాల్సిన అవసరం లేదనిపిస్తోందన్నారు.

తెలంగాణలో నిజాంను మార్చాలా ..? వద్దా ..? అని అమిత్ షా ఈ సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. బండి సంజయ్ యాత్ర ఒక పార్టీ నుంచి మరో పార్టీకి అధికారం బదలాయింపు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ యాత్ర తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. బిజెపికి అధికారం ఇస్తే నీళ్లు, నిధులు, నియామకాల హామీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రానికి నిధులు కూడా వస్తాయని.. నిరుద్యోగులకు ఉపాధి కూడా వస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ విముక్తి సర్థార్ వల్లభాయ్ పటేల్ వల్లేనని ఆయన గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ సర్కార్‌ని సాగనంపేందుకు యువత సిద్ధంగా వుందని అమిత్ షా అన్నారు.

సర్పంచ్‌లకు అధికారం ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ అమలు కాలేదని.. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తామన్న హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్రంపై వుంటుందని, అధికారమిస్తే ప్రతీ ధాన్యం, గింజ కొంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారని ఆయన దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లు ఇస్తే హరితహారాన్ని మీ పథకంగా చెప్పుకుంటున్నారని.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ చేశారా అని అమిత్ షా ప్రశ్నించారు. ఇదే సమయంలో ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్యను ప్రస్తావించారు. సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో నిందితుల్ని వదిలపెట్టమని.. శిక్షించి తీరతామని అమిత్ షా స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News