Monday, December 23, 2024

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు తాము బహిష్కరిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు తాము హాజరుకావడం లేదని వెల్లడించారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోడీ అని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారన్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోడీ తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని మండిపడ్డారు.

మోడీకి తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని పేర్కొన్నారు. విభజన హామీలను ప్రధాని మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులతో కలిసి మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఉన్నా… తూతూమంత్రంగా వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. గుజరాత్‌లోని దహోడ్‌లో రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని అడిగారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని విమర్శించారు.

ధరణిపై హాస్యాస్పదంగా రేవంత్ మాటలు
ధరణి పోర్టల్ విషయంలో రేవంత్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కెటిఆర్ విమర్శించారు. రూ.వేల కోట్లు అంటూ రేవంత్ ఇష్టారీతిన మాట్లాడతారని మండిపడ్డారు. ధరణిపై రేవంత్ ఆరోపణలను కెటిఆర్ తిప్పికొట్టారు. భూదందాలు, కబ్జాలు చేసేవాళ్లకు ధరణి నచ్చట్లేదని అన్నారు. ధరణి ఎంత సఫలం అయిందనేది ప్రజలకు తాము వివరిస్తామని చెప్పారు. ధరణితో చేకూరిన ప్రయోజనాలను తామూ పవర్ ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ధరణి విదేశీయుల చేతుల్లో ఉందని రేవంత్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉందని ఆయన గుర్తించాలని అన్నారు. రేవంత్‌రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం సంస్థలకు అందించి విచారణ చేయించుకోచ్చని చెప్పారు. సచివాలయం కింద వేల కోట్లు ఉన్నాయని రేవంత్ చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తున్నాయని ఎద్దేవా చేశారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్‌రెడ్డి, ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగితే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆయన భూదందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని అక్కసు అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి
జాతీయ కూటములు అనేది మాటల్లోనే ఉంటుంది.. చేతల్లో కుదరదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బిఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. తెలంగాణ గాంధీభవన్‌లో గాడ్సే ఉన్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి అని ఆరోపించారు. రేవంత్ ఏ ఒక్క రోజూ మోదీని విమర్శించరని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రధాని మోడీపై, బిజెపిపై చేసిన విమర్శలలో కనీసం 10 శాతం అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా..? అని ప్రశ్నించారు. రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మనిషి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలవలేదా అని నిలదీశారు. దుబ్బాక, మునుగోడులో కాంగ్రెస్, బిజెపి కలిసి పని చేశాయని, హుజూరాబాద్, నాగార్జునసాగర్‌లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఆ పార్టీల మోసాలు ప్రజలకు తెలుసని వెల్లడించారు. సిఎం కెసిఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని నాయకుడిగా ఎవరూ గురించట్లేదని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో రూ.4 వేల పింఛన్ హామీ ప్రకటించారు..? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీ హోదా ఏంటని నిలదీశారు.

సాయిచంద్, కుసుమ జగదీశ్ మరణం పార్టీకి తీరని లోటు
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్, కుసుమ జగదీశ్ అకాల మరణం ఎంతో బాధించిందని, వారి మరణంతో పార్టీకి ఎంతో తీరని లోటని కెటిఆర్ పేర్కొన్నారు. ఆ ఇద్దరి అకాల మరణంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కలత చెందారని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు పార్టీ ప్రజాప్రతినిధుల నెల జీతం అందజేస్తామని చెప్పారు. ఇరు కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున అందజేస్తామని తెలిపారు. కుసుమ జగదీశ్, సాయిచంద్ తల్లిదండ్రులను కూడా పార్టీ తరపున ఆదుకుంటామని పేర్కొన్నారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా సాయిచంద్ సతీమణి రజిని నియమిస్తున్నామని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లనే పార్టీ నిర్మాణమైందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News