Monday, December 23, 2024

ప్రజల వద్దకు పాలన సత్వరంగా అందిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ప్రజల వద్దకు పాలన సత్వరంగా అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కొత్త కలెక్టరేట్ )లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి రూ. 17 లక్షలతో వ్యయంతో నిర్మించిన సెక్యూరిటీ గదికి ప్రారంభోత్సవం, రూ. 100.78 లక్షల వ్యయంతో చేపట్టనున్న సోలార్ షెడ్ (వాహనాల పార్కింగ్ షేడ్ )నిర్మాణ పనులకుమంత్రి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులోభాగంగా క్రొత్త గ్రామపంచాయతీలు, మండలాలు, డివిజన్లు, మునిసిపాలిటీలు, జిల్లాలు ఏర్పాటుచేసి, ప్రజల వద్దకు పాలన సత్వరంగా అందేలా చర్యలు తీసుకుందన్నారు. ఒకే నమూనా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు దేశంలో ఎక్కడా లేవని, మన రాష్ట్రంలోనే నిర్మించుకున్నామని అన్నారు. ఇప్పటికే 20 సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులోకి తెచ్చామని మంత్రి అన్నారు. సుపరిపాలన కు గొప్ప ఆలోచనలు చేస్తూ, అభివృద్ధి లో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం మోడల్‌గా నిలిచిందని ఆయన తెలిపారు. ధరణి ప్రవేశపెట్టి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూసమస్యలకు పరిష్కారం చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం రోజున ధరణి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండిఉద్యోగులకు మొదటిసారి 43 శాతం, రెండోసారి 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి తొమ్మిదేండ్లలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానకి చెందుతుందన్నారు. జిల్లాలో రెండో విడతలో 1.51 లక్షల మందికి కంటి పరీక్షలు చేపట్టినట్లు ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, సోలార్ రూఫ్ పార్కింగ్ షెడ్ కు ఆలోచన చేసి కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. 5800 చదరపు మీటర్లతో మంచి పార్కింగ్ స్థలం ఏర్పాటుచేసినట్లు, రూఫ్ లేకపోవడంతో ఎండాకాలం వాహనాలకు సమస్యలు వస్తున్నట్లు, దీంతో సోలార్ రూఫ్ పార్కింగ్ షెడ్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఐడిఓసి లో 41 శాఖలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు, వీటికి 230 కిలో వాట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్లు ఆయన అన్నారు. సోలార్ పవర్ షెడ్ తో పార్కింగ్ సమస్యకు పరిష్కారం తో పాటు 110 కిలో వాట్ల పవర్ ఉత్పత్తి అవుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, వివి పాలెం సర్పంచ్ రావెళ్ళ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News