న్యూఢిల్లీ : యమునలో ‘విషం’ కలుపుతున్నారన్న ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తీవ్రంగా నిరసిస్తూ, ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటమికి భయపడిన ‘ఆపద వ్యక్తులు’ తెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వ్యాఖ్యలు దేశానికే అవమానకరమని ఆయన అన్నారు. ఫిబ్రవరి 5 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ కర్తార్ నగర్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ ఆప్ నేతలకు సీరియల్ హంతకుడు, జనాన్ని వంచించడంలో పేరొందినవాడు చార్లెస్ శోభరాజ్‌తో పోల్చారు. అద్దాల మేడ నిర్మించిన వారు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల డబ్బు లూటీ చేసినవారు ప్రజల సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించజాలరు. అందుకు వారు ఢిల్లీలో ఆరోపణలు వ్యాప్తి చేస్తున్నారు. ప్రజలు తమ వలలో పడతారనే అమాయకత్వంతో ఈ ఆపద వ్యక్తులు అబద్ధాలు వల్లె వేస్తుంటారు’ అని మోడీ విమర్శించారు. ఢిల్లీ ప్రజలు, దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రధాని మోడీ, రాయబార కార్యాలయాల్లోని దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు హర్యానా నుంచి అదే నీటిని తాగుతుంటారని ఆయన తెలిపారు.
]‘మోడీపై విషప్రయోగానికి హర్యానా బిజెపి నీటిలో విషం కలుపుతుందని ఎవరైనా భావిస్తారా? మీరు ఏమి అంటున్నారు? పొరపాట్లను క్షమించడం భారతీయుల లక్షణం. కానీ ఢిల్లీ లేదా భారత్ దురుద్దేశంతో చేసిన పాపాలను క్షమించదు’ అని ఆయన అన్నారు. ‘మీరు చార్లెస్ శోభరాజ్ పేరు వినే ఉండవచ్చు, అతను ఘరానా దుండగీడు. అతను జనాన్ని వంచించడంలో ఎంత నిపుణుడు అంటే వారు ప్రతిసారి అతని మాటలకు మోసపోతుంటారు. అందుకే ఎవరైనా అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతతో ఉండాలి’ అని మోడీ అన్నారు. కేజ్రీవాల్‌పై మోడీ విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘మాజీ సిఎం ఒకరు హర్యానా ప్రజలపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారు. ఓటమి భయంతో ఆపదవారు తెగిస్తున్నారు. హర్యానా ఢిల్లీకి భిన్నమా? వారికి ఢిల్లీలో పిల్లలు, బంధువులు లేరా? వారు తమ సొంత మనుషుల కోసం విషం కలుపుతారా?’ అని అన్నారు. ‘ఆపద’ ప్రభుత్వం సాకులు, బోగస్ వాగ్దానాలు, ‘లూటీలు, అసత్యాలు’ ఇక ఎంత మాత్రం పని చేయవని ఢిల్లీ సుస్పష్టం చేసిందని మోడీ పేర్కొన్నారు.
25 సంవత్సరాలు, ఆప్ ప్రభుత్వాల పాలన తరువాత తనకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా వోటర్లకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆప్‌పై విమర్శలను మోడీ కొనసాగిస్తూ, గడచిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ యమున ప్రక్షాళన వాగ్దానంపై వోట్లు అడిగిందని, ఇప్పుడు ఆ సమస్య తమకు వోట్లు రాల్చదని అది చెబుతోందని ఆరోపించారు. చరిత్ర, హర్యానా ప్రజలు, దేశం దానిని విస్మరించలేనంతగా ఆప్ పాపం చేసిందని ఆయన దుయ్యబట్టారు. బిజెపి ‘మురికి రాజకీయాలు’ చేస్తూ ఢిల్లీ ప్రజలను దాహార్తులను చేయజూస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘హర్యానాలో బిజెపి వారు నీటిలో విషం కలిపి ఢిల్లీకి పంపుతున్నారు. ఢిల్లీలో ప్రజలు ఈ నీటిని తాగితే అనేక మంది మరణిస్తారు. ఇంతకు మించిన జుగుప్సాకరమైనది ఉంటుందా’ అని కేజ్రీవాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి మోడీ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పని రోజు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఢిల్లీ మూడ్‌ను, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో అనేందుకు సూచిక అని మోడీ అన్నారు.