Tuesday, November 5, 2024

థర్డ్ వేవ్ తొలి దశలో ఉన్నాం : డబ్లుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

We are in early stages of third wave Says Tedros Adhanom

కొద్ది వారాలుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి
వ్యాక్సిన్ పంపిణీలో అసమానత బాధిస్తోంది : డబ్లుహెచ్‌ఒ

జెనీవా : ప్రస్తుతం ప్రపంచం కరోనా మూడో వేవ్ తొలి దశలో ఉందని, ఆంక్షలు ఎత్తి వేస్తుండడం, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టక పోవడం తదితర వైఫల్యాలతో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చీఫ్ టెడ్రోస్ అథనామ్ గురువారం హెచ్చరించారు. కొద్దికాలం క్రితం టీకా డ్రైవ్ కారణంగా ఐరోపా అంతటా కేసులు తగ్గుతూ వచ్చాయని, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు వ్యతిరేక దిశలో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైరస్‌లో మార్పులు వస్తున్నాయని, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తక్కువ సంఖ్య లోనే వ్యాక్సిన్లు పూర్తయినందున ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన వారపు నివేదికలో ఆందోళన వెలిబుచ్చింది. ఈనెల 13 నాటికి కనీసం 111దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపించి ఉన్నట్టు తేలిందని, రానున్న నెలల్లో ఇది మరింతగా విస్తరించనున్నదని హెచ్చరించింది. ఆల్ఫా రకం 178 దేశాల్లో, బీటా 123 దేశాల్లో, గామా 75 దేశాల్లో కనిపించినట్టు వెల్లడించింది. వీటన్నిటికన్నా డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగం అత్యధికంగా ఉందని పేర్కొంది.

ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్త చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయన్నారు. అలాగే పది వారాల పాటు తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు టెడ్రోస్. ప్రాణాలను రక్షించే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచంలో కొనసాగుతున్న దిగ్భ్రాంతికరమైన అసమానతను కోవిడ్ అత్యవసర కమిటీ గుర్తించిందని టెడ్రోస్ తెలిపారు. అయితే, వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని, అనుకూలమైన, స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. పలు దేశాలు ఇటువంటి చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని టెడ్రోస్ గుర్తుచేశారు.

We are in early stages of third wave Says Tedros Adhanom

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News