పుణె : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ప్రతిపక్ష ఎంఎఇఎ ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో తమ పార్టీలో ఎవ్వరికీ ఆ పదవిపై ఆసక్తి లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్ శుక్రవారం విస్పష్టంగా ప్రకటించారు. ఎన్నికలు జరగవలసి ఉన్న తమ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడంపైనే వారు దృష్టి కేంద్రీకరించారని ఆయన తెలిపారు.
ఠాణె జిల్లా బద్లాపూర్‌లో ఒక పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక అత్యాచారం ఘటనపై ఈ నెల 20 నాటి నిరసనల కారణంగా మహా వికాస అఘాడి (ఎంవిఎ) భాగస్వామ్య పక్షాల మధ్య అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల పంపిణీపై చర్చలు ఆలస్యం అయ్యాయని, ఆ చర్చలు ఈ నెల 27న జరుగుతాయని శరద్ పవార్ తెలియజేశారు. రాష్ట్ర స్థాయి ప్రతిపక్షాల కూటమి ఎంవిఎలో కాంగ్రెస్‌తో పాటు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ భిన్న వైఖరి అనుసరిస్తుండగా, ఆ విషయాన్ని ఎంవిఎ తేల్చాలని శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్కరే పట్టుబట్టుతుండడంపై ప్రశ్నకు శరద్ పవార్ సమాధానం ఇస్తూ, తమ పార్టీకి సంబంధించినంత వరకు సిఎం పదవికి అభ్యర్థిగా నిలిచేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
ఎన్నికలకు ముందు బిజెపి, శివసేన, ఎన్‌సిపితో కూడిన అధికార మహాయుతికి ప్రత్యామ్నాయం కల్పనపైనే దృష్టి కేంద్రీకరించాలని పవార్ స్పష్టం చేశారు. ‘నాకు సంబంధించినంత వరకు నేను బరిలో లేను, అందుకే ఈ అంశం (సిఎం అభ్యర్థి) ప్రస్తావించవలసిన అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతం జనం ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపడంపైనే దృష్టి కేంద్రీకరించడం అవసరం’ అని పవార్ చెప్పారు. ఎంవిఎ పక్షాలు సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపకాన్ని ఖరారు చేయాలని పవార్ సూచించారు.