ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురైంది. ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టులో జెమీమా బరిలోకి దిగనుంది. జెమీమా కెరీర్‌లో ఇదే తొలి టెస్టు మ్యాచ్ కానుంది. కాగా తొలిసారి టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్న యువ బ్యాటర్ రోడ్రిగ్స్‌కు సీనియర్లు మిథాలీ రాజ్, జూలన్ గోస్వామి కొత్త జెర్సీని అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురైంది. క్రికెట్ ఆడాలని కలలు కనే ప్రతి మహిళా క్రికెటర్ తరఫున తాము ఆడుతున్నామని తెలిపింది. భారత మహిళా క్రికెట్ చరిత్ర గురించి మా ప్రధాన కోచ్ రమేశ్ పొవార్ వివరించారు. ఎలా మొదలైంది..ఎలా సాగింది.. ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలను ఆయన మాకు అర్థమయ్యేలా వివరించారు. మా వెనుకటి తరాల క్రికెటర్లు..ఈ రోజు మేమున్న పరిస్థితులకు చేరుకునేలా ఎంతో కృషి చేశారు. వాళ్లకు దక్కాల్సిన గుర్తింపు దక్కనప్పటికి భారత్‌కు మహిళల క్రికెట్‌ను తీసుకొచ్చారు. వారికి తాము సదా రుణపడి ఉంటామని జెమీమా పేర్కొంది.