Monday, December 23, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ ఎంఎన్‌జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్‌జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం
లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను ప్రారంభించిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు. ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో రూ. 32 కోట్లతో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం, రూ.50 లక్షలతో లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎంఎన్‌జె ఆసుపత్రిలో మూడు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉండేవని, అవి కూడా దాదాపుగా 60 సంవత్సరాలు క్రితం ఏర్పాటు చేసినవని చెప్పారు. కొత్త వాటిని నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ ఎంఎన్‌జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారని అన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు.

ఎనిమిది అధునాతన రోబోటిక్ సహా ఎనిమిది మాడ్యులర్ థియేటర్లను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. రూ. 32 కోట్లతో రోబోటికల్ సర్జికల్ ఎక్విప్‌మెంట్ సమకూర్చుకున్నామన్నారు. -రోబో ఎక్విప్‌మెంట్ ద్వారా మరింత వేగంగా, కచ్చితత్వంతో తక్కవ కోతతో ఆపరేషన్లు చేయడం సాధ్యమవుతుందని వివరించారు. -కార్పొరేట్ ఆసుపత్రులు అందించే ఖరీదైన వైద్య సేవలను, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రి పక్కనే మరో 350 పడకలతో కొత్త బ్లాక్ ప్రారంభించుకున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగంలో మొత్తం 750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్‌జె హాస్పిటల్ రికార్డ్ నెలకొల్పిందని వెల్లడించారు. -దేశంలో ముంబైలో 600 పడకలతో టాటా క్యాన్సర్ హాస్పిటల్, 545 పడకలతో చెన్నైలో అడయార్ కేన్సర్ హాస్పిటల్,746 పడకలతో బెంగళూరులో కిద్వాయి కేన్సర్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పారు.

ఢిల్లీ ఎయిమ్స్‌కు సమానంగా ఎంఎన్‌జె సేవలు
ఎంఎన్‌జె ఆసుపత్రి అందిస్తున్న సేవలు, ఢిల్లీలోని ఎయిమ్స్ ద్వారా అందిస్తున్న సేవలకు సమానమని అన్నారు. దేశంలోనే తొలిసారి ఎంఎన్‌జె అధ్వర్యంలో ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్క్రీనింగ్ సేవలు చేరువ చేస్తున్నామని హరీశ్ చెప్పారు.

స్టేట్ క్యాన్సర్ సెంటర్‌గా..
ఎంఎన్‌జె ఆసుపత్రిని రూ. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్‌గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం నిమ్స్, ఎంఎన్‌జెలో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రైవేటులో రూ.25 లక్షల ఖర్చు అయ్యే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. -ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ ఆరు నెలల్లో వంద కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన రికార్డ్ నెలకొల్పిందని వెల్లడించారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో కూడా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. అవసాన దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు సేవలు అందించేందుకు ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రితో పాటు 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటివద్ద ఉండాలనుకునే రోగులకు హోం కేర్ సర్వీసులు కూడా అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 2 లక్షల 22 వేల మంది మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని, అందులో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారినీ ఎంఎన్‌జె ఆసుపత్రికి తరలించి, మంచి వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ. 100 కోట్లతో క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలందిస్తున్నామన్నారు. క్యాన్సర్ చికిత్సపై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం రు. 900 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జాఫర్ హుస్సేన్, ఎంఎల్‌సి ప్రభాకర్ ,టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిఎంఇ డాక్టర్ రమేష్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత పాల్గొన్నారు.

Harish Rao 2

Harish Rao 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News