Friday, November 22, 2024

ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్‌ను కలిశారు. అనంతరం ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ సీపీతో మాట్లాడి మా అనుమానాలు నివృత్తి చేసుకున్నామన్నారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని చెప్పారు. సిరంజి దొరికిందని సిపి చెప్పారని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో వచ్చిందని సిపి చెప్పారన్నారు. కానీ రిపోర్ట్ చూపించలేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామన్న ఆయన ఛార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సిపి చెప్పారని తెలిపారు. కెఎంసి ప్రిన్సిపాల్, హెచ్వోడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామన్నారు.

అసలేం జరిగిందంటే..?

గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్‌ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది.

మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి ప్రీతి బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News