కీవీ: “మా గొంతుకను వినండి.. ఉక్రెయిన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్ అధికారులు శాంతిని కాంక్షిస్తున్నారు. మాకు యుద్దం ఏమాత్రం అవసరం లేదు” అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ జాతిని, రష్యా ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. “యుద్ధం అంటే బాధ, బురదలో కూరుకుపోవడం, రక్తపాతం, వేలాది మంది మరణాలు. మాపై దాడి చేయడం ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మేము మాత్రం యుద్ధం కోరుకోవడం లేదు. మనం శత్రువులం కాదు. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేం కూడా ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది.” అని రష్యన్ భాషలో ప్రసంగించారు. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తరువాత ఆయన చేసిన ప్రసంగం హృదయాలను కదిలించిందని, శాంతిని కోరుకునే తత్వంతో చరిత్రలో నిల్చిపోతారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఉక్రెయిన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇదిలా ఉండగా తాను ప్రపంచ దేశాధినేతలతో చర్చలు జరుపుతున్నానన్న జెలెన్‌స్కీ .. ప్రపంచం తమకు అండగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
We don’t want to War: Ukraine President