Monday, December 23, 2024

మట్టిలో మాణిక్యాలను వెలికి తీశాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించి మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను వెలికి తీశామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ – సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జి. ప్రణీత, వెంకట మహిమ కృష్ణ, శాన్వి బాశెట్టి, అదిరా చేతన్, శ్రీ కీర్తన, అర్జున్ పోర్దర్, కాశ్రీ బాశేట్టిలు జూన్ 4 నుండి 9 వరకు జరిగిన నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్‌లోను, అలాగే జూన్ 22 నుండి 25 వరకు స్టేట్ లెవెల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అండర్ 11, 13 లలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి పతకాలు సాధించిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ వారిని అభినందించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల 500 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను నిర్మించి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నమన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 80 శాతానికి పైగా క్రీడా ప్రాంగణాలను నిర్మించి ప్రారంభించామని తెలిపారు. దేశానికి సరిపడా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నమన్నారు. టేబుల్ టెన్నిస్ లో తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు , పేరు ప్రఖ్యాతలు తేవాలని వచ్చే ఒలంపిక్స్ లో పతకాలు సాధించేలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ మెంటర్ రమేష్ కుమార్, కోచ్ లు అహ్మద్, రామేశ్వర్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News