అధికారంలోకి రాగానే దళితులకు ఏం చేస్తామో వెల్లడిస్తాం
కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి
మనతెలంగాణ/హైదరాబాద్: చేవెళ్లలో ఈనెల 26వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారని, అందులో దళిత డిక్లరేషన్ ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మల్లు రవి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు తాము ఏం చేయబోతున్నామో వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే ఢిల్లీలో దళిత నాయకులతో 2గంటలు ఖర్గే చర్చించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, 10 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పటికైనా కాంగ్రెస్‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.