దుబాయి: యుఎఇ వేదికగా జరుగనున్న ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ మెంటార్ డేవిడ్ హస్సీ జోస్యం చెప్పాడు. తొలి దశలో వరుస ఓటములు చవిచూసిన నైట్‌రైడర్స్ యుఎఇలో మాత్రం వరుస విజయాలు సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టుకు ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. సమష్టి కృషితో రెండో దశలో మంచి ఫలితాలు సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతుందన్నాడు. ఇక ఈసారి తమకు శుభ్‌మన్ గిల్, నితీశ్ చాలా కీలకమన్నాడు. వీరిద్దరూ అసాధారణ ఆటతో ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్నాడు. తొలి దశలో పేలవంగా ఆడిన గిల్, రాణాలు ఈసారి భారీ స్కోర్లు చేయడం తథ్యమన్నాడు. వీరిద్దరూ గాడిలో పడితే కోల్‌కతా కష్టాలు చాలా వరకు తీరిపోతాయన్నాడు. ఇక సీనియర్లు ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, రసెల్‌లు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారన్నాడు.
భారత్‌తో పోల్చితే యుఎఇ పిచ్‌లు తమకు చాలా అనుకూలంగా ఉంటాయన్నాడు. కిందటి సీజన్‌లో యుఎఇలో తమ జట్టు బాగానే ఆడిన విషయాన్ని హస్సీ గుర్తు చేశాడు. కొన్ని మ్యాచుల్లో ఓటమి పాలైనంత మాత్రాన తమ జట్టును తక్కువ చేసి చూడడం సరికాదన్నాడు. క్రికెట్‌లో ప్రతి జట్టుకు గెలుపోటములు సహాజమన్నాడు. కిందటి సీజన్‌లో ఘోరంగా విఫలమైన సిఎస్‌కె ఈసారి నిలకడైన విజయాలు సాధించడమే దీనికి నిదర్శనమన్నాడు. మోర్గాన్ కెప్టెన్సీపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. జట్టును ముందుండి నడిపించే సత్తా అతనికుందన్నాడు. కార్తీక్, రసెల్‌లు తమ ప్రధాన అస్త్రాలు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక ఐపిఎల్‌లో అన్ని జట్లకు సమాన అవకాశాలున్నాడు. ప్రతి జట్టు ఇంకా సగం మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో ప్లేఆఫ్ బెర్త్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నాడు. రెండో దశలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్షంగా తాము బరిలోకి దిగుతున్నట్టు డేవిడ్ హస్సీ స్పష్టం చేశాడు.
We have chances to Playoffs: KKR’s Mentor David Hussey