Monday, December 23, 2024

అప్పన్నపల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని 12 నెలల్లోనే పూర్తి చేశాం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మహబూబ్‌నగర్ అప్పన్నపల్లి మొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు 12 సంవత్సరాలు పట్టిందని, డిజైన్ సైతం సరిగా లేదని, బ్రిడ్జి కట్టిన సంవత్సరానికి యాక్సిడెంట్‌తో ఎంతో మంది చనిపోయారని, అదే రోజున రెండో ఆర్వోబి కోసం పట్టుబట్టి ప్రకటించడం జరిగిందని, అనుకున్న లక్షం ప్రకారం కేవలం 12 నెలల్లోనే రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత తమదని మంత్రి అన్నారు.

మొదటి బ్రిడ్జి నిర్మాణానికి స్థలాలు కోల్పోయిన వాళ్లు, ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంలో దళారీలు జోక్యం చేసుకున్నారని, తాము నిర్మించిన రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జికి పూర్తి స్థాయిలో బాధితులను ఒప్పించి వారు సమ్మతించిన తర్వాతే వారికి అన్ని రకాలుగా నష్టపరిహారాన్ని చెల్లించి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేశామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రతి సంవత్సరం కేంద్రానికి 46వేల కోట్ల రూపాయలను చెల్లిస్తుందని, అందులో కేవలం 20 నుంచి రూ. 26వేల కోట్లు మాత్రమే తిరిగి రాష్ట్రానికి పథకాల పేరు మీద వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ సొంత వనరులతో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో రహదారులతో పాటు, జంక్షన్లు, విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, అన్నింటిని అభివృద్ధి చేస్తున్నామని , పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశామని, మినీ ట్యాంక్ బండ్ , శిల్పారామం నిర్మించామని, దేశంలోనే అతిపెద్దదైన ఎకో పార్కును ఏర్పాటు చేశామని, త్వరలోనే మహబూబ్‌నగర్‌లో 500 డ్రోన్ కెమెరాలతో లేజర్ ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ , ఎస్పీ కె. నర్సింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డీనేటర్ గోపాల్ యాదవ్, డిసిసిబి అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు నటరాజ్ , కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ , క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, డిఎస్పీ మహేష్ , ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సుమారు 2000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒలంపిక్ రన్ ప్రారంభించారు. ఈ రన్ అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి మొదలుకొని బైపాస్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, యువత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News