Wednesday, January 22, 2025

మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు చేశామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ చుట్టూ త్వరలో ‘ ఔటర్ రింగ్ ’ రైలు రహదారిని నిర్మిస్తామని చెప్పారు. రైలు ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పించే దిశలో ఔట్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ మేరకు గురువారం కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి మోహన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ వి.రోజా రాధాకృష్ణ శర్మ, పార్లమెంటు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ , మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎంఎల్‌ఏ రఘునందన్ రావు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి (హాల్ట్) స్టేషన్ వల్ల మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందేందుకు ప్రతిరోజూ కొమురవెల్లికి వచ్చే వేలాది మంది యాత్రికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చడంలో సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొమురవెల్లి స్టేషన్ మనోహరాబాద్ -కొత్తపల్లి నూతన రైల్వే లైన్ వస్తుందని, ఇటీవలే మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో కొంత భాగమైన మనోహరాబాద్ -సిద్దిపేటను జాతికి అంకితం చేశారని ఆయన తెలియజేశారు. కొమురవెల్లి గ్రామానికి రాకపోకలు సాగించే ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలైన ఎత్తైన ప్లాట్ ఫారమ్, ఆలయ నిర్మాణ శైలితో కూడిన స్టేషన్ భవనం, టిక్కెట్ బుకింగ్ కౌంటర్, వైఫై సౌకర్యం వెయిటింగ్ హాల్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి తెలియజేశారు. దీనితోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాల మెరుగుదలకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు తదితర 40 రైల్వేస్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనను తిలకించడం శుభపరిణామమని తెలిపారు. భారతీయ రైల్వేలు సామాన్య ప్రజలకు ఎంతో కీలకమని మరియు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతీయ రైల్వేలు దేశములోని దక్షిణం ఈశాన్య-తూర్పు – పశ్చిమ మొదలైన అన్ని ప్రాంతాలను, మధ్యప్రదేశ్ తో కలుపుతున్నాయని అన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు రైలు అనుసంధానంతో దేశమంతటా భారీ అభివృద్ధిని సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యాత్రికుల సౌకర్యార్థం కొమురవెల్లి స్టేషన్‌లో అన్ని అధునాతన వసతులు వేగవంతముగా నిర్మించబడతాయని ఆశిస్తున్నాను అని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్వాగతోపన్యాసంలో రాబోయే కొమురవెల్లి స్టేషన్ యాత్రికుల ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తుందని, మొదటిసారిగా పుణ్యస్థలానికి ప్రజలకు నేరుగా రైలు అనుసంధానాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. స్టేషన్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉండడమువలన రైలు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులు, చిన్న వ్యాపారులు, సాధారణ ప్రయాణికులు మరియు రోజువారీ కూలీలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రయోజనాలు ఇవీ….
* కొమురవెల్లి ప్రాంత ప్రజలకు మొదటి సారిగా రైలు అనుసంధానం.
* మధ్య తెలంగాణ ప్రాంతంలోని తీర్థయాత్రికుల పర్యాటకానికి గొప్ప ఊతం.
* ప్రయాణీకులకు సురక్షితమైన, వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రైలు ప్రయాణాన్ని అందిస్తుంది.
* ఈ ముఖ్యమైన ఆలయ పట్టణంలో క్రమంగా పెరుగుతున్న జనాభా రవాణా అవసరాలను తీరుస్తుంది.
* తెలంగాణ రాజధానికి నేరుగా రైలు అనుసంధానాన్ని కలుగజేస్తుంది
* మనోహరాబాద్ – కొత్తపల్లి మధ్య నూతన రైల్వే లైన్ పూర్తిగా ప్రారంభమైన తరువాత వేములవాడ, భీమేశ్వరాలయం, కొండగట్టు, కోటిలింగేశ్వర స్వామి దేవాలయం వంటి ముఖ్యమైన యాత్రా స్థలాలను కలుపుతుంది.
* ఈ నూతన రైలు మార్గం పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరం నుండి కరీంనగర్ వైపు అతి తక్కువ దూరం గల మార్గంగా పనిచేస్తుంది తద్వారా సుదూర ప్రాంతాలకు సైతం రైళ్లను ప్రవేశపెట్టడానికి వీలు కల్పిస్తుంది.
* ఈ ప్రాంతంలోని ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News