ప్రధాని మోడీ వెల్లడి
పనాజీ: జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తెలిపారు. దీని వల్ల ఇప్పటివరకు దేశంలోని 10 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. గోవా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు పైపుల ద్వారా 100 శాతం నల్లా నీటి సరఫరా సాధించిన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ స్వాతంత్య్రానంతరం గడచిన ఏడు దశాబ్దాలలో కేవలం 3 కోట్ల గ్రామీణ ప్రజలకు మాత్రమే నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయని, కాని గత మూడేళ్లలో అదనంగా మరో ఏడు 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని తెలియచేస్తుందని ఆయన చెప్పారు. పనాజీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.