బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా వ్యాఖ్య
ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్): దేశంలో బిజెపి మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కుటుంబాల ఆధారంగా నడుస్తున్నవేనని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ వంటి ప్రపంచ దేశాలకు ఆమోదయోగ్యమైన నాయకుడు సభ్యుడిగా ఉన్న బిజెపిలో 18 కోట్ల మంది భారతీయులకు సభ్యత్వం ఉందని, బిజెపికి ఏ పార్టీ సాటిరాదని ఆయన అన్నారు.
గురువారం నాడిక్కడ బిజెపి వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 కోట్ల మందికి పైగా సభ్యత్వాలు సంపాదించడం అంత సులభం కాదని, ఈ సంఖ్యకు దరిదాపుల్లోకి ఏ రాజకీయ పార్టీ రావడం అసంభవమని అన్నారు. సాంస్కృతిక జాతీయవాదాన్ని పాటిస్తూ సమష్టి కృషితో శాస్త్రీయంగా తమ పార్టీ అభివృద్ధి చెందుతున్నదని ఆయన చెప్పారు. తమ ఐక్యతే తమ పార్టీ బలమని, పార్టీలో సొంత అభివృద్ధి కోసం తరచు స్వీయ అంచనా వేసుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్(అందరితో కలసి, అందరి పురోభివృద్ధి, అందరి విశ్వాసం) అన్నది తమ పార్టీ సిద్ధాంతమని, ఈ మూడు అంశాలే తమ ప్రభుత్వ పథకాలకు మూలాధారాలని నడ్డా అన్నారు. త్వరలోనే దేశంలోని అన్ని జిల్లాలలో పార్టీకి సొంత కార్యాలయాలు ఉంటాయని ఆయన ప్రకటించారు.