Friday, November 22, 2024

మాతా శిశు మరణాలు తగ్గించాం

- Advertisement -
- Advertisement -

ఈ విషయంలో రాష్ట్రానికి దేశంలోనే మూడోస్థానం

గాంధీ ఆస్పత్రిలో 200 పడకల ఎంసిహెచ్ హాస్పిటల్  ప్రారంభించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాతా శిశు మరణాలు చాలావరకు తగ్గించామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తల్లి మరణాలను 93 శాతం ఉంటే.. ఇప్పుడు 42 శాతానికి తగ్గించామని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలను కూడా అరికట్టగలిగామని చెప్పారు. మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచిందని అన్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశిశు మరణాల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో రూ.52 కోట్లతో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్ హాస్పిటల్, 33 నియో నాటల్ అంబులెన్స్‌లను, రూ.1.2 కోట్లతో ఆధునీకరించిన డైట్ కిచెన్‌లను ఆదివారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, మూడు ఎంసిహెచ్ ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, అందులో ఒకటి గాంధీ ఆసుపత్రిలో నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. త్వరలో నిమ్స్ ఆసుపత్రి, అల్వాల్ టిమ్స్‌లో ఎంసిహెచ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. పెద్ద హాస్పిటల్స్ ఎంసిహెచ్ ఆసుపత్రులు అందుబాటులోకి రావడం వల్ల గుండె, కిడ్నీ, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణీలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ఈ సమస్యలతో గర్భం దాల్చిన మహిళలు ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.లక్షలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంసిహెచ్ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

గర్భిణీలకు డయాలసిస్ అవసరమైతే ఉన్నచోటనే డయాలసిస్ అందించేదుకు ఎంసిహెచ్ ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్ అండ్ చైల్డ్ కేర్’ సెంటర్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని చెప్పారు. వెంటిలేటర్లు, గుండె పరీక్షల కోసం 2డి-ఎకో యంత్రాలు, ల్యాప్రోస్కోపి యంత్రాలను సైతం ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రస్తుతం గాంధీ దవాఖానలో 300 పడకల సామర్ధ్యంతో ప్రసూతి విభాగం అందుబాటులో ఉందని, ఇందులో 200 పడకలు గర్భిణులు, స్త్రీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించగా, మరో 100 పడకలు చిన్నపిల్లల కోసం ఉన్నాయని వివరించారు. గాంధీ దవాఖానకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉంటుందని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన 200 పడకల సామర్ధ్యం గల ఎంసీహెచ్ సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌తో మాతా, శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. గాంధీ హాస్పిటల్‌లో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో గర్భిణులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసమే దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఫెసిలిటీ తొలిసారిగా తెలంగాణలోనే ఏర్పాటయిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగడం, మాతా శిశు మరణాలు గణనీయం తగ్గడం సిఎం కెసిఆర్ పరిపాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నియోనాటల్ అంబులెన్స్‌ల్లో అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉంటాయని, వాటి ద్వారా శిశు మరణాలు సంభవించకుండా అరికట్టగలుగుతామని మంత్రి తెలిపారు. అలాగే గాంధీలో అత్యాధునిక మోడ్నన్ కిచెన్‌ను ప్రారంభించుకున్నామన్నారు.
జిల్లాకో నియోనాటల్ అంబులెన్స్
చిన్నారుల మరణాలను అరికట్టడానికి అన్ని జిల్లాలకు ఒక్కో నియో నాటల్ అంబులెన్స్‌ను ప్రారంభించామని చెప్పారు. నవజాత శిశువులను అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరవేసి తద్వారా సకాలంలో చికిత్స అందించేందుకుగాను నియోనాటల్ అంబులెన్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే చిన్నారుల కోసం 33 నియోనాటల్ అబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ అంబులెన్సులు అన్ని జిల్లాల్లో ఉంటాయని, ఇందులో నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ ఇంక్యుబేటర్, నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం, హ్యూమిడిఫైయర్, పల్స్ ఆక్సిమీటర్, సుదీర్ఘ బ్యాటరీతో సిరంజి పంప్, సక్షన్ ఆపరేటస్ వంటివి ఉంటాయని ఉంటాయని చెప్పారు. వీటికి ఏడాదికి మొత్తం అంచనా వ్యయం రూ.8.07 కోట్లు అవుతుందని అన్నారు. నవజాత శిశువుల అంబులెన్స్ సేవలను ప్రవేశపెట్టడం మరియు ఉపయోగించడం ద్వారా నవజాత శిశు మరణాల మరింత తగ్గుతాయని అన్నారు. ఈ అంబులెన్సుల ద్వారా శిశు మరణాలు తగ్గించవచ్చని వెల్లడించారు. దూరప్రాంతాల నుండి అత్యవసరం అయితే ఆసుపత్రికి చిన్నారులను చెరవెర్చడం కొంత ఆలస్యం అవుతుందని, దానికి ఈ అంబులెన్స్‌లు పరిష్కారమని వ్యాఖ్యానించారు.
త్వరలో గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్
నిమ్స్, ఉస్మానియాతో పాటు గాంధీ ఆసుపత్రిలో కూడా త్వరలో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తామని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి లివర్‌ను ఉస్మానియా ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేయబోతున్నామని చెప్పారు. అలాగే వివిధ కారణాల వల్ల మాతృత్వానికి దూరమైన మహిళల కోసం ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
గాంధీకి ఐఎస్‌ఒ గుర్తింపు
గాంధీ ఆసుపత్రికి ఐఎస్‌ఒ గుర్తింపు లభించగా, ఆ సర్టిఫికెట్‌ను మంత్రి హరీశ్‌రావు గాంధీ సూపరింటెంటెండ్ డాక్టర్ రాజారావుకు అందజేశారు. గాంధీ ఆసుపత్రికి ఐఎస్‌ఒ 9001,ఐఎస్‌ఒ 45001 గుర్తింపు రావడం చాలా గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, ఎంఎల్‌సి వాణిదేవి, డిప్యూటీ మేయర్ హేమలత, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News