Sunday, December 22, 2024

స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డిని సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఘటనపై వాస్తవ నివేదిక అందించేందుకు 5 గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
హకీంపేట్ ఘటన కలచివేసిందన్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ / హైదరాబాద్ : హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో విద్యార్థినీలపై లైంగిక ఆరోపణలు వచ్చిన వార్త కథనంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్ స్కూలు ఓఎస్‌డి హరికృష్ణను తక్షణం సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తమకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు తెలిసిందని, దీంతో గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఘటన రుజువైతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని, అవసరమైతే ఉరి తీయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. భారత మహిళల రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన గుర్తు చేశారు.

హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో జరిగిన సంఘటనలపై వాస్తవ నివేదిక సమర్పించాలని కోరుతూ 5 గురు సభ్యుల కమిటీని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నియమించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ , క్రీడా శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిందని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ వార్త పత్రికలో వచ్చిన కథనం మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అంతే కాకుండా క్రీడాకారిణిలకు , వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హకీంపేట్ ఘటన కలచివేసింది : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత
కాగా హకీంపేట్ క్రీడా పాఠశాలలో ఓ అధికారి బాలికలను వేధిస్తున్నారంటూ వచ్చిన కథనాలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఎంఎల్‌సి కవిత అన్నారు. ఈ మేరకు బాలికలను వేధిస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. హకీంపేట క్రీడా పాఠశాలలో బాలికలపై వేధింపుల ఘటనను ప్రస్తావించారు. బాలికలపై వేధింపులు చేస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచివి కావనీ తెలిపారు. కాగా ఎంఎల్‌సి కవిత విజ్ఞప్తిపై మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. స్పోర్ట్ స్కూలు ఓఎస్‌డిని తక్షణం సస్పెండ్ చేశారు. ఈ మేరకు సదరు అధికారిని సస్పెండ్ చేసి ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. కాగా కాగా ఇదే అంశంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News