జామ్‌నగర్ ఆస్పత్రి కాంట్రాక్టు మహిళా సేవకుల ఆరోపణ : దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
అహ్మదాబాద్ :గుజరాత్ జామ్‌నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టుపై పనిచేస్తున్న మహిళా సిబ్బంది తాము సూపర్వైజర్ల లైంగిక వాంఛలను తిరస్కరించినందుకు ఉద్యోగాలు కోల్పోయామని ఆరోపించడం తీవ్ర వివాదాంశం అయింది. దీనిపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దర్యాప్తునకు ఆదేశించారు. గాంధీనగర్ లో కేబినెట్ మీటింగ్ పూర్తయిన తరువాత రాష్ట్ర హోం మంత్రి ప్రదీప్ సిన్హా జడేజా దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రకటించారు. జామ్ నగర్ లోని గురుగోవింద్‌సింగ్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన కొంతమంది మహిళా సహాయకులు తమ సూపర్వైజర్ల లైంగిక కోరికలను అంగీకరించక పోవడం వల్లనే ఉద్యోగాల నుంచి తొలగించబడ్డామని ఆరోపణలు చేసినట్టు మంత్రి తెలిపారు.
వీరంతా ఔట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిపై నియమించ బడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా మహిలా సహాయకురాలు ఒకరు విలేఖరులతో మాట్లాడుతూ వార్డుబాయ్‌ల ద్వారా చనువు కోసం సూపర్వైజర్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని నిరాకరించిన వారిని గత మూడు నెలలుగా ఎలాంటి వేతనం చెల్లించకుండా ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారని ఆరోపించారు. బుధవారం కేబినెట్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. దీంతో దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు మంత్రి జడేజా ప్రకటించారు. ఈమేరకు ముగ్గురి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.