Friday, November 15, 2024

చీతాల మృతిని ముందే ఊహించాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికానుంచి తీసుకువచ్చిన రెండు చీతాలు మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్స, పర్యావరణ మంత్రిత్వ శాఖ(డిఎఫ్‌ఎఫ్‌ఇ) స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.‘ పెద్దపెద్ద మాంసాహార జంతువులను ఒకచోటునుంచి మరో చోటికి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్లిష్టమైన పని. అంతేకాకుండా కొన్ని జంతువులు కొత్త వాతావరణానికి అలవాటుపడలేవు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయి’ అని ఆ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో చీతాలు మృతి చెందడానికి గల కారణాలపై ఎదురు చూస్తున్నామని దక్షిణాఫ్రికా తెలిపింది. తాజాగా మృతి చెందిన చీతా శవపరీక్ష నివేదిక వచ్చాక దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొంది.

అయితే చీతాల మృతికి అంటువ్యాధులు కారణమై ఉండవచ్చనే దానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని డిఎఫ్‌ఎఫ్‌ఇ తెలిపింది. ఫ్రీ ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టిన తర్వాత కొన్ని చీతాలు కునో నేషనల్ పార్కు సరిహద్దులు దాటి వెళుతున్నాయని, తిరిగి ఎలా రావాలో తెలియక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, ఇది కూడా వాటి మరణానికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే చీతాలు క్రమంగా ఆ ప్రాంతానికి అలవాటు పడి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే మామూలు పరిస్థితులు వస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మిగిలిన 11చీతాలను రెండు నెలల్లో ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి పంపాలని కునో నేషనల్ పార్కు అధికారులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాలనుంచి 20 చీతాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటిలో ఒక ఆడ చీతా గత మార్చిలో, మరో మగ చీతా ఇటీవల మరణించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News