గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేసిన సస్పెండైన ఎంపిలు
న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెండయిన ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపిలు బుధవారం పార్లమెంటు కాంప్లెక్స్ లోపల ఉన్న మమాత్మాగాంధీ విగ్రహం వద్ద రోజంతా ధర్నా నిర్వహించారు. తమ సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకు ప్రతిరోజూ ధర్నాలు కొనసాగిస్తామని కూడా వారు ప్రకటించారు. తమను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నిరంకుశమని పేర్కొన్న వారు ప్రజల సమస్యలను లేవనెత్తినందుకు తాము క్షమాపణ చెప్పబోమని స్పష్టం చేశారు. ‘అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. మా ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోను ఆందోళన చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10నుంచి 11 గంటల వరకు విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. వారు ఆ అందోళనను కొనసాగిస్తారు. సస్పెండయిన ఎంపిలు కూడా ప్రతి రోజూ ఉదయం 10గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధరా చేస్తారు’ అని సస్పెండయిన12 మంది ఎంపిలలో ఒకరైన రిపున్ బోరా పిటిఐకి తెలిపారు.
తమ సస్పెన్షన్‌ను నిరంకుశ చర్యగా వారు అభివర్ణిస్తూ తాము పెరుగుతున్న ధరలు, పెగాసస్ కుంభకోణం లాంటి రైతులు, ప్రజల సమస్యలను లేవనెత్తామని, తమని ఎందుకు సస్పెండ్ చేశారో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా అని ప్రశ్నించిన ఎంపిలు అందుకు తాము క్షమాపణ చెప్పాలా అని నిలదీశారు.తాము తమ ఆందోళనను కొనసాగిస్తామని, తమ సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే ఇతర రూపాల్లో తమ ఆందోళనను ఉధృతం చేస్తామనిమరో ఎంపి సయ్యద్ నాసిర్ హుస్సేన్ చెప్పారు.