Friday, November 22, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం

- Advertisement -
- Advertisement -
మన బస్తీ మన బడి ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం
సనత్‌నగర్‌లోని అశోక్‌నగర్‌లో పాఠశాల సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సనత్ నగర్‌లోని అశోక్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మంత్రులు సందర్శించి పాఠశాలలోని సమస్యలు, ఇబ్బందుల గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకుని రెండు మూడు లో ఉన్నతాధికారులతో కలిసి పాఠశాలలను సందర్శించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టిఎస్‌ఈడబ్లూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ ఆర్జేడి విజయలక్ష్మి, జేడి ప్రసాద్, అదనపు కలెక్టర్ అభిషేక్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి లతో కలిసి పాఠశాలలను సందర్శించారు.

ఈ పాఠశాలలోనే తెలుగు, ఉర్దూ మీడియం ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ సందర్బంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ తమకు వడ్డించే మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండటంలేదని, దాంతో తమ ఇంటి వద్దనుండే బోజనాలు తెచ్చుకుంటున్నామని వివరించారు. రుచికరమైన, నాణ్యమైన బోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా మరుగుదొడ్లు సరిగా లేవని, నీటి కొరత ఉన్నదని, పర్నిచర్ కూడా లేదని, సిబ్బంది కొరత ఉన్నదని, స్వీపర్లు లేకపోవడంతో పాఠశాల పరిశుభ్రత సక్రమంగా ఉండటం లేదని మంత్రుల దృష్టికి విద్యార్ధులు తీసుకు రాగా, వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. సిబ్బంది అదనంగా ఉన్న పాఠశాల నుండి అవసరమైన సిబ్బందిని డిప్యుషన్ పై ఇక్కడ నియమించాలని అక్కడికక్కడే మంత్రి అధికారులను ఆదేశించారు.

పాఠశాలలలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేపడతారని, పర్యవేక్షించాలని అక్కడే ఉన్న ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్‌ను ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన బస్తీ మన బడి కార్యక్రమం రెండవ విడత లో ఈ పాఠశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్, టాయిలెట్స్ నిర్మాణం వంటి అన్ని పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. విద్యార్ధులకు వడ్డించే భోజనం సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించాల్సిన బాద్యత పాఠశాలల సిబ్బంది పై ఉన్నదని గుర్తుచేశారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సమస్యలను తెలుసుకొని పేరెంట్స్ కమిటీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. దాతల సహకారంతో పాఠశాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మందికి విద్యను అందించడం జరుగుతుందని చెప్పారు. ఒక్కో విద్యార్ధి కోసం సంవత్సరానికి ఒక లక్ష 20 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే విద్యార్ధులకు సన్న బియ్యం తో నాణ్యమైన, రుచికరమైన బోజనాన్ని విద్యార్ధులకు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, ప్రదానోపాద్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి, విద్యాధికారి ఆంజనేయులు, వాటర్ వర్క్ జిఎం హరి శంకర్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News