నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలి
పల్లా, ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : జనగాం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతివ్వాలని ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు తెలిపారు. ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మంత్రుల నివాసంలోని క్లబ్ హౌజ్‌లో మంగళవారం జనగాం బిఆర్‌ఎస్ ఆశావహులతో మంత్రి కెటిఆర్ సమావేశం నిర్వహించారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎ టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇతర ఆశావహుల మధ్య మంత్రి కెటిఆర్ సయోధ్య కుదిర్చారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతు బంధు సమితి చైర్మెన్, ఎంఎల్‌ఎ టి.రాజయ్య, మాజీ ఎంఎల్‌సిలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని.. కష్టపడిన నేతలు, కార్యకర్తలందరికీ తగిన అవకాశాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి, జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ గెలిపించడానికి అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు మంత్రి కెటిఆర్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
జనగాం బిఆర్‌ఎస్ టికెట్‌పై వీడిన ఉత్కంఠ
బిఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చిన దశలో.. జనగామ రాజకీయం వేడెక్కింది. సిట్టింగ్ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ టికెట్‌ను ఆశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం జరగామ టికెట్ ఎవరికి ఇస్తుందో అనే ఉత్కంఠకు తెరపడింది. సిట్టింగ్ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్‌టిసి ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి ఇటీవల టిఎస్‌ఆర్‌టిసి నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి జనగామ బిఆర్‌ఎస్ టికెట్‌ను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఖరారు చేశారు.