తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర గణనీయమైనదే
నియామక పత్రాలు అందజేస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు ఉద్యోగులు, కార్మికుల పాత్ర గణనీయమైనదని , ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం వారికి దన్నుగా ఉంటోందని పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నట్లుగానే నేటి రాష్ట్ర అభివృద్ధిలోను వారు ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు. ఇప్పటికే హరితహారం లాంటి పలు కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న వీరు తమ బిఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల సంఘంను ఆయన అభినందించారు. ఆదివారం ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ సంఘం నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంజీవ్ నాయక్, ఐటి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ రవీందర్ నాయక్, విద్యాశాఖ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ సామల శశిధర్ రెడ్డిలను సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు నియమించగా ఆ సంఘానికి వ్యవస్థాపక గౌరవ ముఖ్య సలహాదారుడిగా ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మేరకు వారికి ఈ నియామక పత్రాలను అందజేశారు. ప్రైవేటు ఉద్యోగులకు కార్మికుల కోసం తమ తోడ్పాటును అందిస్తున్న ఆ సంఘం తీరును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్ ,ప్రైవేటు టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కార్తీక్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.