సంక్షోభ నివారణ చర్యలకు మాత్రం మద్దతు ఇస్తాం
శ్రీలంక ప్రతిపక్ష పార్టీల స్పష్టీకరణ
కొలంబో: ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో తాము భాగస్వాములు కాబోమని శ్రీంకలోని ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ దాదాపుగా ప్రకటించాయి. అయితే అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయిన దేశాన్ని వీలయినంత త్వరగా బయటపడేందుకు ప్రభుత్వం తీసుకునేచర్యలకు బయటినుంచి మద్దతు ఇస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి. శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే చేత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గురువారం హడావుడిగా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు దాడులు చేయడంతో శ్రీంకలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగడం, మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.ఈ ఆందోళనల్లో 9 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు.ఈ నేపథ్యంలో రణిల్ విక్రమ్ సింఘె చేత ప్రధానిగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే విక్రమ్ సింఘె పార్టీకి పార్లమెంటులో ఒకే ఒక ఎంపి ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు.
అయితే రాజపక్సవిక్రమ్ సింఘె ప్రభుత్వంలో తాము భాగస్వాములం కాలేమని గొటబాయ రాజపక్సకు చెందిన శ్రీలంక పీపుల్ పార్టీనుంచి వేరుపడి స్వతంత్రగ్రూపుగా ఏర్పడిన వర్గానికి చెందిన ఎంపి ఒకరు చెప్పారు. మాజీ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ( ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) కేంద్ర కమిటీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి కాకూడదని నిర్ణయించింది. మార్కిస్టు జనతా విముక్తి పెరుమన( జెవిపి) కూడా ప్రభుత్వంలో చేరబోమని స్పష్టం చేసింది. కాగా విక్రమ్ సింఘె 2020లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలవలేదు కనుక ఆయనకు ప్రధాని అయ్యే నైతిక హక్కు లేదని ప్రధాన ప్రతిపక్షమైన సమగి జన బలవెగయ (ఎస్‌జెపి) వ్యాఖ్యానించింది. అందువల్ల ఆయన ప్రభుత్వంలో మంత్రిపదవులను తామ పార్టీ స్వీకరించదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి రంజిత్ మద్దుమ బండార స్పష్టం చేశారు. ప్రధాని పదవికి విక్రమ్ సింఘె రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలనుంచి కూడా తనకు మద్దతు ఉందని రణిల్ విక్రమ్ సింఘె అంటుండడం విశేషం.