అబూధాబి: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తమకు సహాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు సార్లు యుద్ధం చేసిన తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని అంగీకరించారు. అంతేకాకుండా పొరుగుదేశంతో శాంతిని కోరుకుంటున్నామని వెల్లడించిన ఆయన .. కశ్మీర్‌లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని సూచించారు. దుబాయ్ కేంద్రంగా పని చేసే ‘అల్ అరబియా’ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి పిలుపునిచ్చారు.‘ భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి నా సందేశం ఏమిటంటే..ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా నడుస్తున్న కశ్మీర్‌వంటి వివాదాలపై నిజాయితీగా, నిబద్ధతతో చర్చలు జరుపుదాం.
శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడం లేక ఒకరితో ఒకరు తగువులాడుకుంటూ సమయం, సామర్థాన్ని వృథా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది’అని భారత్‌నుద్దేశిస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఇంటర్వూలో పేర్కొన్నారు. సోమవారం ఈ ఇంటర్వూ ప్రసారం అయింది.‘ భారత్‌తో మేము మూడు యుద్ధాలు చేశాం. వాటితో ప్రజలకు చివరికి మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే. మేము గుణపాఠం నేర్చుకున్నాం. భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం. దీంతో మా దేశంలో నెలకొన్న అసలు సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలు కలుగుతుంది’ అని షాబాజ్ అన్నారు. రెండుదేశాల వద్ద ఇంజనీర్లు, డాక్టరు,నిపుణులైన కార్మికులు ఉన్నారన్న ఆయన.. దక్షిణాసియా కోసం ఈ వనరులను ఉపయోగించుకుని ఇక్కడ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా రెండు దేశాలు ప్రగతిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. బాంబులు, మందుగుండు వంటి వాటిపై తమ వనరులను వృథా చేసుకోవాలని కోరుకోవడం లేదని పాక్ ప్రధానిపేర్కొన్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తన పౌరులకు కనీస నిత్యావసర సరకులను సైతం అందించలేకపోతోంది. ఇతర వస్తువుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడమే కాకుండా గోధుమపిండి కోసం కూడా ప్రజలు కొట్లాడుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు తెహ్రీక్‌ఎ తాలిబన్ పాకిస్థాన్(టిటిపి)నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలా వివిధ రూపాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాక్‌కు విదేశాలనుంచి సాయం మాత్రం అంతంతమాత్రమే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో శాంతిపేరుతో భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం. అయితే గత ఏడాది నవంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో చర్చల సందర్భంగా పాక్ కశ్మీర్ అంశాన్నిలేవనెత్తడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అబద్ధాలను ప్రచారం చేయడానికి చేస్తున్న వృథా ప్రయత్నంగా దాన్ని అభివర్ణించిన విషయం తెలిసిందే. జమ్మూ, కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలవాల్ భుట్టో జర్దారి తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు భారత్ దీనిపై తీవ్రంగా స్పందించడం విదితమే