Sunday, December 22, 2024

మళ్లీ మనమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాబోయే వంద రోజులు పార్టీకి చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన తీర్పుతో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు రాబోయే వంద రోజులు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక బిజెపి కార్యకర్తలు సమాజం కోసం ఎంతో చేశారని, రేయింబవళ్లు కష్టపడ్డారని, భరతమాత ప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికే తమ శక్తిని వినియోగించారని కొనియాడారు. గెలుపుపై ఎవరికీ అనుమానాలు లేవన్నారు. 18 ఏళ్లు నిండిన యువత అం తా 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయబోతోందన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా దేశానికి తగినంత సేవ చేశా రు. ఇక విశ్రాంతి తీసుకోవచ్చుకదా అని ఓ సీనియర్ నేత గతంలో తనతో అన్నారని ప్రధాని అంటూ తాను ‘రాజనీతి’ కోసం కాకుండా ‘రాష్ట్రనీతి’ కోసం పని చేస్తున్నానన్నారు. ‘అధికారాన్ని అనుభవించడం కోసం మూడోసారి గెలిపించమని నేను అడగడం లేదు. నా ఇంటిగురించి నేను ఆలోచించి ఉంటే కోట్లాది మందికి ఇళ్లు నిర్మించగలిగే వాడిని కాను. పేదప్రజల భవిష్యత్తుకోసం జీవిస్తున్నాను. కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కష్టాలను పరిష్కరించాలన్నదే నా లక్షం’ అని మోడీ చెప్పారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల రెండో రోజు ఆదివారం నాడు ప్రధాని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

ఎన్‌డిఎ సర్కార్‌కు 400 సీట్లు ఖాయమని విపక్షాలు సైతం నినదిస్తున్నాయని, అయితే ఎన్‌డిఎ ఆ సంఖ్యకు చేరుకోవాలంటే బిజెపి 370 సీట్లు సాధించాలని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా భారత్‌తో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.‘ ఎన్నికలు ఇంకా జరగలేదు. అయినా ఇప్పటికే జులై, ఆగ స్టు, సెప్టెంబర్ నెలలకుగాను వివిధ దేశాలనుంచి నాకు ఆ హ్వానాలు వచ్చాయి. అంటే దీని అర్థం తిరిగి బిజెపి ప్రభు త్వం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బలంగా నమ్ముతున్నాయి’ అని మోడీ అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. ఇది మోడీ గ్యారంటీ అని చెప్పారు. పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు గతంలోకంటే మెరుగయ్యాయన్నారు.
కాంగ్రెస్‌కు విజన్ లేదు
దాదాపు 65 నిమిషాల తన ప్రసంగంలో ప్రధాని ప్రతిపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘బిజెపిని సైద్ధాంతికంగా ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లే దు. అందుకే మోడీని తిట్టడం, నాపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆ పార్టీ నేతల సింగిల్ పాయింట్ అజెండాగా మారింది’ అని ప్రధాని విమర్శించారు. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదు.దేశ అస్థిరతకు కాంగ్రెస్ ప్ర ధాన కారణం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు జనని కాంగ్రెస్, కులాల అధారంగా ప్రజలను విభజించాలని కాం గ్రెస్ కుట్రలు పన్నుతోంది. నిజాయితీ, సుపరిపాలనను ప్ర జలు ఆదరిస్తారు. గత పదేళ్లలో ప్రాంతీయ భేదం లేకుండా దేశాన్ని అభివద్ధి పథంలో నడిపించాం.పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కుంభకోణాలు లేని పరిపాలనను అందించాం. ఉగ్రవాదాన్ని అణచివేశాం. మౌలిక సదుపాయాలు మెరుగైతే యువతకు మరి న్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.జిఎస్‌టి వసూళ్లు 11 లక్షల కోట్లకు పెరిగాయి. పన్నుల రూపంలో లభించే ఆ దాయం పెరగడంతో అభివృద్ధి పథకాల అమలు మెరుగవుతోంది. సేద్యంలో అధునిక పద్ధతులను అవలంబించినప్పు డే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది.అణగారిన వర్గాల అభివృద్ధే మా ప్రభుత్వ లక్షమని ప్రధాని అన్నారు.
నారీ శక్తికి పెద్దపీట
దేశంలోని మహిళలు, పేదలు, యువత కలల్ని నెరవేర్చడమే తన లక్షమని అన్నారు. ఆరోగ్యకరమైన మహిళలతోనే ఆరోగ్యవంతమైన దేశం సాకారమవుతుంది. పోషణ్ అభియాన్ కింద గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నాం.10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాం. వారి రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకువచ్చాం. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నిర్మించాం. 25 కోట్ల ఇళ్లకు శౌచాలయ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. శౌచాలయ సమస్యను లేవనెత్తిన ,ఎర్రకోటపైనుంచి మహిళల గౌరవం గురించి మాట్లాడిన తొలి ప్రధానిని తానేనని మోడీ అన్నారు. తాము తప్ప వికసిత్ భారత్‌కు హామీ ఎవరూ ఇవ్వలేరన్నారు.
దశాబ్దాల సమస్యలకు పరిష్కారం
గత పదేళ్ల కాలంలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా ఈ రోజు మాట్లాడుకుంటోందని, ప్రతి రంగంలోను దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుందన్నారు. ఇవేమీ చిన్న చిన్న తీర్మానాలు కావని,అవి మన కలలని, భారత దేశాన్ని అభివృద్ధి పరచాలన్నదే ఆ కలని అన్నారు.ఈ దిశగా రాబోయే అయిదేళ్లలో పెద్ద పాత్రను పోషించబోతున్నామని, గతంకంటే ఎన్నో రెట్లు వేగంగా దూసుకుపోయేలా మనం పని చేయాల్సి ఉంటుందని మోడీ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనుల పరిష్కారానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లామని, 500 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య రామాలయాన్ని నిర్మించామన్నారు. ‘ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి పరిపాలనలో ప్రస్ఫుటమవుతోందన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య భారతాన్ని పూర్తిగా నిర్లక్షం చేశాయని, అయితే తమ ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాలనుంచి రికార్డు ప్రాతినిధ్యం లభించిందన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాసే బిజెపి లక్షమని ప్రధాని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతిఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. పదేళ్ల పాలన, రానున్న అయిదేళ్ల విజన్ వారి చేతికి ఇవ్వాలన్నారు. నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News