Friday, December 27, 2024

విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -

కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్‌కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని కృష్ణాబోర్డు చైర్మన్‌ను హెచ్చరించింది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వ ప్రతిపాదన పై కె.ఆర్.ఎం.బి విముఖత వ్యక్తం చేసిందని,తాజాగా కేంద్ర జల శక్తి శాఖ వద్ద జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను కే.అర్.ఏం.బి చైర్మన్ శివ నందన్ కుమార్ వ్యతిరేకించారని,ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనివలన కృష్ణా బేసిన్ లోని రైతులకు,జల వనరుల శాఖ అధికారుల కు జరిగే నష్టం పై స్పందిస్తూ.. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాదు ఎర్రమంజిల్ లోని జల సౌధబోర్డు కార్యాలయంలో కె.ఆర్.ఎం.బి చైర్మన్ శివనందన్ కుమార్ ను కలిసి పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ లు చేయడానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడిందని, దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 జనవరిలో ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటానికి భవనాలను పరిశీలించటం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 2020జూన్ లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని విజయవాడలోనే కె.ఆర్.ఎం.బి కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి కి లేఖ రాస్తూ దాని ప్రతిని కె.ఆర్.ఎం.బి హైదరాబాద్ కు పంపటం జరిగిందన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో 2019 నవంబర్ లోనూ 2020 ఆగస్టులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయడం జరిగిందని తెలిపారు.

ఇది ఇలా ఉండగా వీటికి విరుద్ధముగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంలో భాగముగా కార్యనిర్వాహక రాజధాని నెపంతో కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని,నిర్ణయం తీసుకోవడం సహేతుకము కాదని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన కె.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ దాటి కృష్ణా డెల్టాకు 400 కిలోమీటర్లు, నాగార్జున సాగర్‌కు  700 కిలోమీటర్లు, శ్రీశైలానికి 800 కిలోమీటర్ల దూరంలో గోదావరి బేసిన్ దాటి అవతల ఉన్న విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో కేంద్ర జల శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,తెలంగాణ ప్రభుత్వము మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని కృష్ణా నది మీద ఉన్న 30 లక్షలు ఎకరాల ఆయకట్టుకు నవ్యాంధ్రప్రదేశ్ లోని రైలు, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే విజయవాడలోనే కే.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కే.ఆర్.ఎం.బి చైర్మన్ శివ నందన్ కుమార్‌ను డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసినటువంటి టీ.హరీష్ రావు, కె. తారక రామారావు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కృష్ణా జలాలను 50;50 శాతం పెంచాలనే ప్రకటనలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసి లలో 2015 జూన్ లో కే.ఆర్.ఎం.బి దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించుకుని ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టిఎంసిలు తాత్కాలిక కేటాయింపులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కు 66 శాతం తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసుకోవాలి అనే తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇప్పటి వరకు ఉమ్మడి నీటి ప్రాజెక్టులైన శ్రీశైలం,నాగార్జునసాగర్ లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలతో కేటాయింపులు జరుపుకుంటున్నారని, తాజాగా బి. ఆర్.ఎస్ మాజీ మంత్రులు చేసిన 50;-50 శాతం వాటాలతో ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తే శ్రీశైలం దిగు భాగాన ఆంధ్రప్రదేశ్ లో ఎస్.అర్.బి.సి కింద ఉన్న రెండు లక్షల ఎకరాలు నాగార్జునసాగర్ కుడి,ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు కృష్ణ డెల్టా కింద ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు మొత్తం కూడా,వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీరు రాకుండా మొత్తం బీడుబారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర జల శక్తి శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి శ్రీశైలం,నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు తీసుకోవాలనే నిర్ణయానికి స్వాగతం పలుకుతున్నట్టు వెల్లడించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ఆయకట్టు లోని రెగ్యులేటర్ల పై సిఐఎస్‌ఎఫ్ కేంద్రబలగారు పహారా పెట్టి ఆంధ్రప్రదేశ్ లోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందటానికి చర్యలు తీసుకోవాలి అని కే.ఆర్.ఎం.బి చైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్టు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పేర్కొన్నారు.

Krishna Board 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News