పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలుపుతాం
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
నిథమ్, శిల్పారామంలను సందర్శించిన మంత్రి
మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందని పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా నిథమ్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. శుక్రవారం గచ్చిబౌలీలోని నేషనల్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) సంస్థను, అలాగే హైటెక్ సిటీ లోని శిల్పారామంను జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
మొదటగా నిథమ్ లోని అకడమిక్ బ్లాక్ లోని క్లాస్ రూంలు, హాస్పిటాలిటీ బ్లాక్ లోని కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్ట్రారెంట్ మాక్ రూమ్స్, తరగతి గదులను మంత్రి పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి బెంచ్ పై కూర్చొని విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం పెరుగుతుందని, దీంతో ఉపాధి అవకాశాలకు పెరుగుతున్నాయని, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు సులువుగానే ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులు కూడా తమకు అందిస్తున్న ప్రపంచ స్థాయి సౌకర్యాలను, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకొని తెలంగాణ పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని, నైపుణ్యాలను పెంచుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. బోధన, భోదనేతర ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూజీసీ స్కేల్ ప్రకారం వారికి వేతనాలు అందేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. నిథమ్ లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు ఉపకరణాలు, కొత్త కోర్సులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం నిథమ్ నిర్వహణపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. పర్యాటక రంగంలో టూరిస్ట్ గైడ్ ల పాత్ర కీలకమని, వారు పర్యాటక ప్రాంతాలు, చరిత్ర గురించి పరిజ్ఞానం ఉండాలన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, గైడ్స్ కు ఫారెన్ లాంగ్వేజ్ కోర్స్ లను కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని, దీనికి ఐఎఫ్‌ఎల్ యుతో అసోసియేట్ కావాలని అన్నారు. కొత్త కోర్సులు, ఆ తర్వాత మాదాపూర్ లోని శిల్పారామాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పారామం నిర్వహణ, అభివృద్ధిపై ఎథ్నిక్ హాల్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పర్యాటక, ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల అత్యధిక వేతనాలు పొందవచ్చని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో శిల్పారామం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని లోతుగా అధ్యయనం చేసి శిల్పారామం ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శిల్పారామంకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ, నిథమ్ డైరెక్టర్ కె. నిఖిల, టిఎస్ టిడిసి ఎండి రమేష్ నాయుడు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్ రావు నిథమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిషెల్ జె ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.