చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
జిల్లాలోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొస్తాం
చెరువులు, నాలాల కబ్జాకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలి
చెరువు ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదు
ఖమ్మంలో ఓ మాజీ మంత్రి ఆక్రమణల వల్లే అక్కడ వరదలు వచ్చాయి
ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే కెటిఆర్ ఇంగ్లండ్‌లో కూర్చోని ట్వీట్లు చేస్తున్నారు
మహబూబాబాద్‌లో సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లాలోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొస్తామని, చెరువులు, కుంటల ఆక్రమణ క్షమించరాని నేరమని, ఈ ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేయాలని, దీంతోపాటు చెరువులు, నాలాల కబ్జాకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో మహబూబాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆకేరు వాగుబారిన పడిన మూడు తండాలను కలిపి ఆదర్శ గ్రామంగా నిర్మిస్తామని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం అధికారులకు సూచించారు. విదేశాల్లో కెటిఆర్ జల్సా చేస్తున్నాడని, కెసిఆర్ ఓ మానవత్వంలేని మనిషని సిఎం రేవంత్ విమర్శించారు.
ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
చెరువులు, కుంటల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని, వాటిని అరికట్టేందుకు హైడ్రా తరహా వ్యవస్థలను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరమని ఆయన అన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వివరించారు. చెరువులు, కుంటలు నాలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకున్న వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు చెరువు ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని అన్నారు.
ఆక్రమణకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ఖమ్మంలో ఓ మాజీ మంత్రి ఆక్రమణల వల్లే అక్కడ వరదలు వచ్చాయని, వాటిని తొలగింపజేసే దమ్ము మాజీ మంత్రి హరీశ్ రావుకు ఉందా..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే కెటిఆర్ ఇంగ్లండ్‌లో కూర్చోని ట్వీట్లు చేస్తున్నారని సిఎం విమర్శించారు. వందల ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయల్దేరినట్టు హరీశ్ రావు ఖమ్మం యాత్ర పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బాధితుల వద్దకు వచ్చారా..? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్‌కు మానవత్వం లేదని ఆయన అన్నారు.
బురదను తొలగించే పనులు వేగవంతం చేయాలి
వరద తగ్గుముఖం పట్టినందున బురదను తొలగించే పనులు వేగవంతం చేయాలని అధికారులకు సిఎం సూచించారు. కూలిపోయిన స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధరించి తక్షణమే విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. జాతీయ విపత్తుగా భావించి ఐదు వేల కోట్ల పరిహారం ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే సహాయచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం చాలావరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు.