Wednesday, January 22, 2025

త్వరలోనే కొత్త పారిశ్రామిక పాలసీ

- Advertisement -
- Advertisement -

పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన
31,500 కోట్ల పెట్టుబడులు..30,750 ఉద్యోగాలు
రాష్ట్రంలో బయోడిజైర్ సిటీ ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీని కోరాం
ఐటీ రంగంలో గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ ఏర్పాటుకు ఒప్పందం
మేము వినోదం కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త టెక్నాలజీతో రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ నాయకుల బంధువులు వచ్చినా ఆహ్వానిస్తామని, త్వరలోనే కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకురాబోతున్నామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా ,సౌత్ కొరియా పర్యటనలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 19 సంస్థలతో 31 వేల 500 కోట్ల ఓప్పందం చేసుకున్నామని, దీని ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

అమెరికా సౌత్ కొరియా పర్యటనలో కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామని, పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లామని శ్రీధర్ బాబు చెప్పారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యటన హిట్టయిందా?ప్లాప్ అయ్యిందా అన్న ప్రశ్న కాదని, పెట్టుబడులు రావాలి..యువతకు ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. సౌత్ కొరియా లాంటి దేశంలో పర్యటించడం తొలిసారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలతో సీఎం చర్చలు జరిపారన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని కంపెనీ ప్రతినిధులను కోరామని చెప్పారు.

సెమీ కండక్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపామని, వరల్ బ్యాంక్ ఛైర్మన్, అడాబ్ సీఈవోతో కూడా చర్చలు జరిపామమని, మొదటి సారి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా వెళ్లామని శ్రీధర్ బాబు వెల్లడించారు. గత పదేళ్లలో ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా వెళ్లలేదన్నారు. హైదరాబాద్ 4.0 విజన్ ను పారిశ్రామిక వేత్తలకు వివరించామని చెప్పారు. ఐటీ రంగంలో గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీ ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీని కోరామన్నారు. అమెజాన్ సంస్థ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. మోనార్క్ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ల కంపెనీ ఏర్పాటుకు, బయో ఇథనాల్ తయారీ కంపెనీలతో ఒప్పందం జరిగిందని శ్రీధర్ బాబు వెల్లడించారు.

వినోదం కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు: ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణను వీడి ఇతర రాష్ట్రానికి తరలి వెళ్తున్న్నదని దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికి పోవడం లేదని స్పష్టత ఇచ్చారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరిస్తాయన్నారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన మంచిని కంటిన్యూ చేస్తామని తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పరిశ్రమల్లో 30 శాతానికి మించి గ్రౌండ్ కాలేదని, కానీ తమ హయాంలోని విదేశీ పర్యటనల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలను గ్రౌండ్ చేయడానికి స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దావోస్ పర్యటనలో చేసుకున్న 40 వేల కోట్ల పెట్టుబడులపై ఆయా సంస్థలతో అధికారులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఎంఓయూ జరగ్గానే వెంటనే గ్రౌండ్ అవ్వదని, కేసీఆర్ గతంలో రెండు ఫ్లైట్లలో చైనా వెళ్లారని, ఆసమయంలో రూ.వెయ్యి కోట్ల ఎంవోయూ జరిగితే గ్రౌండ్ అయింది వందో రెండు వందలో మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలకు నమ్మకాన్ని కల్పించేలా సీఎం పర్యటన కొనసాగిందన్నారు. మేము వినోదం కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదని, రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమిటో తెలియజేసేందుకు ఒక ప్రయత్నం చేశామన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై పలువురితో చర్చించామన్నారు. ఈ విదేశీ పర్యటనలో మొత్తం 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఈ ఎంవోయూల ద్వారా 30 వేల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపామన్నారు. రాబోయే 20 ఏళ్లపాటు కాంగ్రెస్ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనేది ప్రభుత్వ లక్ష్యం అని, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి అనుకూల వాతావరణం ఉందని వివరించామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

విస్తరించేందుకు కంపెనీలు ఆసక్తి: కార్నింగ్ సంస్థ కంపెనీ విస్తరణపై కొత్తగా ఒప్పందం చేసుకుందని, కాగ్నిజెంట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీని కోరామన్నారు. రాష్ట్రంలో మెగా ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని హ్యూందాయ్ కంపెనీ ముందుకు వచ్చిందని, హైదరాబాద్ లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని యంగ్ వన్ కంపెనీ ముందుకు వచ్చిందని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవనం కోసం కొన్ని అధ్యయనాలు చేశామని, మూసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చించామన్నారు. ప్రగతికి సంబంధించిన అంశంలో మాకు ఎలాంటి రాజకీయ బేషజాలు లేవని చెప్పామన్నారు. చైనా ప్లస్ 1 అనే ఫిలాసఫి మేము ముందుకు వెళ్తున్నామని, తెలంగాణలో స్పోర్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో భాగంగా సీఎం కొరియన్ నేషనల్ స్పోరట్స్ యూనివర్సిటీని సందర్శించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News