ఈనెల 26 నాటి సదస్సు అక్టోబర్ మొదటి వారానికి వాయిదా
ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభలలో ‘రిజరేవషన్లకు సంబంధించి బిసి బిల్లు సాధన కోసం మరో స్వాతంత్ర సమరంలా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఈనెల 26న తలపెట్టిన సదస్సును భారీ స్థాయిలో నిర్వహించడానికి అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన బిసి భవన్’లో రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చట్టసభలలో బిసిలకు రాజకీయ రిజర్వేషన్‌ల సాధన ఈ వర్గాల చిరకాల డిమాండ్ అని కృష్ణయ్య పేర్కొన్నారు. ఉభయ సభలలో‘ బిసి బిల్లు‘ప్రవేశపెట్టి ఆమోదించేంతవరకు మా పోరాటం ఆగదని, అనేక దశలుగా పలు రూపాలలో కొనసాగుతుందన్నారు. అన్ని పక్షాల బిసి సంఘాలు, కుల సంఘాలు ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ వకుళాభరణం మాట్లాడుతూ మహిళా బిల్లుల్లో ఓబిసి సబ్ కోటాను చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 75 కోట్ల ఓబిసీల డిమాండ్‌ను తప్పక నెరవేర్చినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అన్నారు బిసిల డిమాండ్లను కేంద్రం సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. తక్కువ సమయంలో తేదీని నిర్ణయించడం, గణేష్ నవరాత్రుల కారణంగా అనేకమంది ప్రముఖుల సూచనల మేరకు ఈ నెల ’26’న నిర్వహించాల్సిన ‘బిసి బిల్లు‘ సాధన సదస్సును వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలోగా భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బిపి సంఘాలు, సామాజిక వేత్తలు, వివిధ ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ అంశంపై పూర్తిస్థాయిలో పనిచేసే నిపుణులను కూడా బిసి సదస్సుకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బిసి కమిషన్ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ నులి జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ బి ఆర్‌ఎస్ నాయకుడు నాగేంద్ర గౌడ్, రాజ్ కుమార్ దితరులు పాల్గొన్నారు.