Friday, November 15, 2024

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్,బిఆర్‌ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒకటే
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్,బిఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు
కుటుంబ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగదు
కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు, అవినీతి
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టబోతుంది
తెలంగాణ ప్రజలకు 12 సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించాలి
సభనంతరం చార్మినార్ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్,బిఆర్‌ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒక్కటేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. వ్యూహాత్మకంగా మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, వారి ప్రధాన లక్ష్యం బిజెపి, ప్రధాని మోడీని ఓడించడమేనన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన బిజెపి సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. కుటుంబాల చేతిలో ఉన్న ఆ పార్టీలు ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు కోరవని కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడుతున్నాయని ఆరోపించారు. త్వరలో సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని ఆ జాబితాపై సమాధానం చెప్పిన తరువాతే కమలం పార్టీపై విమర్శలు చేయాలని చురకలు వేశారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజలంతా మరోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని, కేంద్రంలో మరోసారి రానున్నది బిజెపి పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.పదేళ్లలో మోడీ సర్కార్ అవినీతిని అంతం చేసిందని, దేశం సురక్షితంగా ఉందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని, మోడీ హాయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకపోతుందని వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు:  కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని, రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి 400 ఎంపీ సీట్లను కానుకగా ఇద్దామని అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోదీ నామస్మరణే మార్మోగుతుందని, తెలంగాణ ప్రజలు బిజెపికి 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లిస్ ఒక్కటేనని ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తాయని, తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చొప్పున వేస్తూ, అండగా ఉంటోందని, వచ్చే ఐదేళ్లలో దేశమంతటా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తుందన్నారు. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్‌కు భయపడుతోందన్నారు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మాత్రమే వస్తే,బిజెపి పాలనలో మాత్రం ఇప్పటికే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు వచ్చాయని తమ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదన్నారు. సభానంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకుని అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపి అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు.

అనంతరం కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి ప్రసంగిస్తూ మోదీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని ఆయన నియంతృత్వ పాలనతో రాష్టం అభివృద్దికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీ ప్రజలు ఈసారి జరిగే ఎన్నికలతో మజ్లిస్ పీడ తొలగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంటు ఎన్నికల్లో రాముడి పేరుతో ప్రచారం చేస్తాం:  బండి సంజయ్
లోక్‌సభ ఎన్నికల్లో రాముడి పేరు చెప్పుకునే ప్రచారం చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు మాజీ సిఎం కెసిఆర్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్ అన్న పేరు మనం స్మరిస్తుంటే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి నేతలకు తప్పా ఎవరికైనా రాముడి పేరు పలికే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వందరోజులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు ఇంకెంతకాలం పడుతుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామన్నారు. రాష్ట్రంలో టిఎస్‌పిఎస్సీ పేపర్ లీకులు జరిగితే కొట్లాడింది బిజెపి నాయకులని, ఈ విషయంలో మాపార్టీ నేతలు జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. మా కుంటుంబాలను పక్కన పెట్టి నిజాం, రజాకార్ల, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడామని తెలిపారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, కాంగ్రెస్ నేతలు కూడా బిజెపి పోరాటం మాకు అధికారాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని ప్రజలను నమ్మించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందన్నారు. ఈసమావేశంలో బిజెఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయలశంకర్, రాకేష్‌రెడ్డి, సూర్యానారాయణగుప్తా, వెంకటరమణరెడ్డి రాష్ట్ర నాయకులతో పాటు, వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ ఇంచార్జీలు పాల్గొన్ని ప్రసంగించారు.

ఎల్బీ స్టేడియం సభకు రాజాసింగ్ దూరం: సికింద్రాబాద్ సోషల్ మీడియా బృందం సమావేశంతో పాటు ఎల్బీస్టేడియంలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సమ్మేళన సభకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. వారం రోజుల కితం పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు కూడా ఆయన హాజరుకాలేదు. ఇటీవల హైకమాండ్ మొదటి జాబితాలో హైదరాబాద్ ఎంపి అభ్యర్థి మాధవిలతను ప్రకటించడంపై ఆయన విముఖత వ్యక్తం చేశారు. మరుసటి రోజు హైదరాబాద్ స్దానానికి పోటీ చేసే మగాడు లేడా అని రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News