Monday, December 23, 2024

పరిశోధనల్లో ఓయూతో భాగస్వామ్యం చేసుకుంటాం..

- Advertisement -
- Advertisement -

థాయ్‌లాండ్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: థాయ్ లాండ్ లోని ఉబాన్ రట్చతని విశ్వవిద్యాలయ ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయం సందర్శించింది. యూబీయూ అధ్యక్షుడు డాక్టర్ చుతినమ్ ప్రసిత్ పురిప్రేచ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ నేతృత్వంలోని ఓయూ బృందంతో భేటీ సమావేశ జరిపింది. ఈసందర్బంగా యూబీయూ అధ్యక్షుడు మాట్లాడుతూ తమది ఉత్తర థాయిలాండ్ కు చెందిన 33 ఏళ్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయమని,  అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు, సదస్సులు, కార్యశాలలు, సమావేశాలు, పరిశోధనల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. తమ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల వివరాలను వెల్లడించిన ఆయన అకాడమిక్ సహకారంతో పాటు విద్యార్థుల పరస్పర మార్పిడి సహా తదితర అంశాలపై తమ ఆసక్తిని ఓయూ బృందానికి తెలిపారు.

రెండు విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయటం ద్వారా వచ్చే ఫలితాలని విద్యార్థులు, పరిశోధకులకు అందించాలని చెన్నై రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ మిస్టర్ నితిరూగి ఫొనెప్రసెర్ట్, మిస్టర్ మెంగ్కోల్ సివాలుక్ అన్నారు. అనంతరం ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో ఓయూ కలిసి పనిచేస్తుందని గుర్తు చేశారు. యూబీయూ తో కలిసి పనిచేసేందుకు సానుకూలత చూపిన ఆయన మరింత విస్తృత చర్చ తర్వాతా త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సులు, మౌళిక వసతులు, పరిశోధనలు, ఓయూ చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా యూబీయూ ప్రతినిధి బృందానికి ఆచార్య రవిందర్ వివరించారు. ఈ సందర్భంగా విదేశీ విద్యార్థులకు అవసరమైన సమాచారం, అడ్మిషన్ల ప్రక్రియ, సౌకర్యాలు, ఉత్తమ పద్దతులు, మౌళిక సదుపాయాలని ఓయూ ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ ఆచార్య ఎల్. శివరామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రతినిధి బృందంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ, ఆచార్య బి. రెడ్యానాయక్, ప్రొ, పి. సరితారెడ్డి, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, సీనియర్ అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News