కరీంనగర్: మట్టి రోడ్డు లేని నగరంగా కరీంనగర్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మం త్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం మంత్రి మీ సేవ కార్యాలయంలో నగర మేయర్ వై సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు అబ్బురపడే విధంగా నగరంలో అభివృద్ధి కొనసాగుతుందని, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తామని, మిగతా సమయంలో తమ ధ్యాస అంత అభివృద్ధి పైనే అని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం నగర అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని అన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ సహకారంతో రానున్న రోజుల్లో మట్టి రోడ్డు లేని కరీంనగర్ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కార్పొరేషన్ పరిధిలో సీఎం హామీ నిధులు 132కోట్లు, కరీంనగర్ రూరల్‌లో 25 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని ఆగస్టు 15 నుండి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అనిల్ గౌడ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, యూత్ అధ్యక్షుడు కుల్దీప్ వర్మ, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.