Sunday, December 22, 2024

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు షాక్
బెంగాల్‌లో ఒంటరిగా పోటీ
టిఎంసి చీఫ్, సిఎం మమతా బెనర్జీ ప్రకటన
మా సీట్ల ప్రతిపాదనకు కాంగ్రెస్ తిరస్కృతి
పంజాబ్‌లో ఆప్ సిఎం నుంచి అదే రీతి ప్రకటన

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ నుంచి ‘ఇండియా’ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్, పంజాబ్ సిఎంలు ఇద్దరూ ఒకే విధమైన ప్రకటన చేసి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని తమ పార్టీ నిశ్చయించినట్లు మమతా బెనర్జీ బుధవారం వెల్లడించారు. ‘నేను వారికి (కాంగ్రెస్‌కు) (సీట్ల పంపకంపై) ఒక ప్రతిపాదన ఇచ్చాను.

కాని వారు మొదట్లోనే దానిని తిరస్కరించారు. బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని మా పార్టీ ఇప్పుడు నిర్ణయించింది’ అని ఆమె చెప్పారు. కాంగ్రెస్, టిఎంసి మధ్యసీట్ల పంపిణీ సమస్య గురించి ప్రస్తావిస్తూ మమతా ఆ విషయం తెలియజేశారు. సీట్ల పంపకం చర్చల గురించి మీడియాలో వస్తున్న వార్తలను కూడా సిఎం ఖండించారు. ఈ అంశంపై తాను కాంగ్రెస్‌లో ఎవ్వరితోనూ మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. ‘బెంగాల్‌లో కాంగ్రెస్‌తో ఇక ఎటువంటి సంబంధమూ ఉండరాదని మేము నిశ్చయించాం’ అని మమత చెప్పారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు టిఎంసి రెండు సీట్లు ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ ప్రతిపాదన ఏమాత్రం సరిపోదని ఆ పార్టీ భావించింది. కాగా, సిపిఐ (ఎం) నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, టిఎంసి 28 పార్టీల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పక్షాలే. ‘కాంగ్రెస్‌ను ఒంటరిగా 300 సీట్లకు పోటీ చేయనివ్వండి. ప్రాంతీయ పార్టీలు సంఘటితంగా ఉన్నాయి. తక్కిన సీట్లకు అవి పోటీ చేయగలవు. అయితే, బెంగాల్‌లో వారి (కాంగ్రెస్) జోక్యాన్ని మేము సహించబోం’ అని మమత అన్నారు. కోల్‌కతాలో ఇటీవలి ర్యాలీలో టిఎంసి చీఫ్ ఇటువంటి వ్యాఖ్యే చేశారు. నిర్దిష్ట ప్రాంతాలలో బిజెపిపై ప్రాంతీయ పార్టీల నేతలు కలసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆమె సమర్థించారు.

కాంగ్రెస్ విడిగా 300 లోక్‌సభ సీట్లకు పోటీ చేయాలని ఆమె సూచించారు. ప్రతిపక్షాల పొత్తుకు తిరుగులేని తమ మద్దతును మమత పునరుద్ఘాటిస్తూ, ‘జాతీయ స్థాయిలో మేము ఇండియా కూటమిలో భాగంగా ఎన్నికల అనంతరం మా వైఖరిని తేలుస్తాం. బిజెపి పరాజయానికి ఏమి చేయాలో అది చేస్తాం’ అని మమత చెప్పారు. ఇక రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి మమత ప్రస్తావిస్తూ, బెంగాలళ్‌లో ఆ యాత్ర వివరాలపై తమకు సమాచారం లేదని తెలిపారు. రాహుల్ యాత్ర గురువారం బెంగాల్‌లో ప్రవేశించవలసి ఉంది.

పంజాబ్‌లో 13 లోక్‌సభ సీట్లు గెలుస్తాం : మాన్
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్‌లో కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ బుధవారం చండీగఢ్‌లో విస్పష్టంగా ప్రకటించారు. పంజాబ్‌లో మొత్తం 13 సీట్లనూ ఆప్ గెలుచుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్‌లో పార్లమెంటరీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో తమ పార్టీ చేతులు కలపబోదని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన రోజే ఆప్ నుంచి ఆ ప్రకటన వెలువడడం గమనార్హం.

కాంగ్రెస్, టిఎంసి, సిపంఐ (ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌తో పాటు 28 పార్టీల ‘ఇండియా’ కూటమిలో ఆప్ భాగస్వామ్య పక్షం. సార్వత్రిక ఎన్నికల కోసం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్‌లలో సీట్ల పంపిణీపై చర్చల్లో ఆప్, కాంగ్రెస్ నిమగ్నమై ఉన్న తరుణంలో పంజాబ్ సిఎం ఆ ప్రకటన చేశారు. అయితే, చండీగఢ్ మేయర్ ఎన్నికలకు కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తుపై ఒక ప్రశ్నకు మాన్ సమాధానం ఇస్తూ, ‘పంజాబ్ దేశంలో హీరో అవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆప్ 130 సీట్లను గెలుచుకుంటుంది’ అని తాను ఎన్నో సార్లు చెప్పానని తెలిపారు. అంటే కాంగ్రెస్‌తో ఆప్ ఎన్నికల పొత్తు పెట్టుకోదన్నది స్పష్టమేనా అన్న ప్రశ్నకు ‘మేము వారితో (కాంగ్రెస్‌తో) కలసి సాగబోవడం లేదు’ అని మాన్ సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News