Saturday, November 23, 2024

పార్టీకి పూర్వ వైభవం లక్ష్యంగా 119 స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని.. ఇతర పార్టీల నుంచి చేరికలే ఇందుకు నిదర్శనమని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని , ఇటు ఎన్నికల నోటిఫికేషన్ నాటికి టిడిపిలోకి వలసలు మరింత ఊపందుకుంటాయని ఆయన వెల్లడించారు. గెలుపు దిశగా నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. వేగంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెద్దపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌టిపి యువజన విభాగం అధ్యక్షుడు పలకల చంద్రారెడ్డి, వొదేల మండల యూత్ ప్రెసిడెంట్ కొలిపాక రాజు ముదిరాజ్‌లకు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

వీరు తెలంగాణ ఐ టిడిపి వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తమ పార్టీలో చేరారని, వారిని అభినందిస్తున్నానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు సారధ్యంలో సమర్థ నాయకత్వం, సుపరిపాలన కోసం ప్రజలు మరలా తెలుగుదేశం పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలకు నాలుగు నెలలే సమయం ఉన్నందున గతంలో టిడిపి హయాంలో ప్రజలకు ఎలాంటి మంచి చేశామో, గెలిపిస్తే ఏం చేయబోతున్నామో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం పొందాలని పార్టీ నాయకులకు సూచించారు.

అభివృద్ధి, సంక్షేమం కోసం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్, ఐ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, చేవెళ్ల పార్లమెంటు అధ్యక్షుడు సుభాష్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మీర్ పేట్ కార్పోరేటర్ మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News