Wednesday, January 22, 2025

మహిళా బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని బిఆర్‌ఎస్ నేత, భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం’ పేరుతో బుధవారం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో 13 పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిన అంశంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒక్కో అడుగు ముందుకు వేద్దాం అని, మహిళలకు ఎవరూ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకే మహిళా రిజర్వేషన్లను కోరుకుంటున్నా మని కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేదాకా పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని కానీ అవి అమలు కావడం లేదన్నారు. ఆకాశంలో సగం, ధరణిలో సగం అవకాశంలో సగమని మహిళలకు సమాన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు. బిల్లు ఆమోదం కోసం మొన్న జంతర్‌మంతర్‌లో ధర్నా చేశామని, దీనికి కొనసాగింపుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామన్నారు. ఇందులో అన్ని పార్టీలను పిలుచుకొని పార్లమెంటులో ఏం చేయాలన్న దానిపై చర్చించామని, వారి మద్దతు కూడగట్టుకున్నామని కవిత తెలిపారు.

మోడీ హామీ అమలు చేయడం లేదు: సిపిఐ

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు మహిళా రిజర్వేషన్ ఇస్తామని అన్నారని, కానీ మోడీ హామీ అమలు చేయడం లేదన్నారు. బిజెపి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోవడం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. తాము మోడీని వ్యతిరేకిస్తాం కానీ, మహిళా బిల్లు విషయంలో సిపిఐ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సిపిఐ ఎంపి బినాయ్ బిశ్వం మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులను సరికాదని సూచించారు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు.

రిజర్వేషన్‌ల కోసం మహిళలు ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి: ప్రియాంక చతుర్వేది

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్ధతు ఇస్తామని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపి ప్రియాంకా చతుర్వేదితో పాటు ఆర్‌ఎల్డీ ఎంపి ప్రతిభ తెలిపారు. శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని ఆమె సూచించారు.

రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాలి:ప్రతిభా సింగ్

ఆర్‌ఎల్డీ పార్టీ మహిళా విభాగం నాయకురాలు ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరిలు మాట్లాడుతూ రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదన్నారు.

రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తాం: ఆర్జేడి ఎంపి

ఆర్జేడి ఎంపి మనోజ్ ఝా మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తామని ప్రకటించారు. అయితే, రిజర్వేషన్‌లో రిజర్వేషన్ కోటా ఉండాలని ప్రతిపాదించారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

కవిత పోరాటానికి అండగా: జేఎంఎం ఎంపి

జేఎంఎం ఎంపి మౌహ మాఝి మాట్లాడుతూ ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం తక్కువ ఉండడం కరెక్ట్ కాదన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందేనన్నారు. కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.

ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావాలి: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్ద మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావాలని ఆయన సూచించారు.

చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం పెరగాలి: సమాజవాది పార్టీ ఎంపి

సమాజవాది పార్టీ ఎంపి ఎస్టీ హాసన్ మాట్లాడుతూ మహిళలకు తగిన వాటా కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం పెరగాలన్నారు.

ఈ బిల్లు ఆలస్యం చేస్తే ప్రజలకు అన్యాయం: విసికే ఎంపి

విసికే ఎంపి తిరుమావలవన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమన్నారు. ఆలస్యం చేస్తే దేశానికి, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

కవితతో కలిసి పోరాటం చేస్తాం: డిఏంకె ఎంపి

డిఏంకె ఎంపి తమిళ్ సై తంగపంద్యాన్ మాట్లాడుతూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తామన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినా ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News