Wednesday, December 25, 2024

ఉస్మానియా అభివృద్ధికి సహకారం అందిస్తాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఏర్పాటులో ఓయూ కీలక భూమిక
నిజాం కళాశాలలో చదవడం తనకు గర్వంగా ఉంది
బాలుర నూతన హాస్టల్, తరగతి గదుల సమూహానికి శంకుస్థాపన
ఉస్మానియాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్, పట్టణాభివృద్ది , ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకుల పట్ల తమకు గౌరవం ఉందని వెల్లడించారు. శనివారం నిజాం కళాశాల ఆవరణలో బాలుర నూతన హాస్టల్, తరగతి గదుల సమూహాం నిర్మాణానికి మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. తాను ఇదే కళాశాలలో 1993 నుంచి 1996 వరకు చదివిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ఇప్పటికే నిర్మించిన నూతన హాస్టల్ భవనాన్ని బాలికలకు కేటాయించగా మరో 18.75 కోట్లతో బాలుర వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. తాను నిజాం కళాశాలలో చదువుకున్నందుకు గర్విస్తున్నానన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని కొనియాడారు.

రాష్ట్ర విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఇటీవల ఉస్మానియాకు నాలుగో స్థానం దక్కటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు పక్కనే ఉన్న మాణికేశ్వర్ నగర్ బస్తీ వాసులకు వైద్య సదుపాయాలు అందించేందుకు నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ విజ్ఞప్తి మేరకు ఎన్‌సిసి నుంచి అడిక్ మెట్ రోడ్డు వరకు నూతన రహదారిని నిర్మించేందుకు అవసరమైన రూ. 16.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులను ఓయూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం చాలా మంచి కార్యక్రమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిజాం కళాశాల మైదానాన్ని కాపాడేలా అవసరమైతే పదంతస్థుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రగతి భవన్, రాష్ట్ర సచివాలయం తరహా లిఫ్ట్ లను ఏర్పాటు చేసి ఎత్తైన భవనాలు నిర్మించి విద్యార్థులకు వసతి, తరగతి గదులు ఎర్పాటు చేయాలని… ఇందుకు అవసరమైన నిధులు అందించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ విద్యారంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నిజాం కళాశాల విద్యార్థుల పట్ల ప్రేమతో అవసరైమన సహకారాన్ని అందిస్తున్న మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిజాం కళాశాలలో చదివిన ఎంతో మంది ఉన్నతస్థాయికి చేరినా తాను చదివిన విద్యాసంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు హాస్టల్ వసతి మరింత ధైరాన్నిస్తుందని చెప్పారు. బాలికల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు, కళాశాలలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యార్థినులు ఉన్నత విద్యలో అత్యధికంగా వస్తున్నారని చెప్పారు.

ఉన్నత విద్యా సంస్థల్లో 60 నుంచి 70శాతం విద్యార్థినులు చదువుకోవటం మహిళా మంత్రిగా గర్వంగా ఉందని స్పష్టం చేశారు. ఉన్నత విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సంవత్సరం దాదాపు రూ. 500 కోట్లు యూనివర్సిటీల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 140కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని ఓయూ అభివృద్ధి కోసం మంత్రి కెటిఆర్ తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఓయూలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడగగానే నిధులు మంజూరు చేయటం సంతోషంగా ఉందని వివరించారు. తాను ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టాక ఓయూలో చేపట్టిన సంస్కరణలకు ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్, నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా, ప్రొఫెసర్ గోపాల్ నాయక్, డాక్టర్ జి. ఉపెందర్ రెడ్డి, ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ప్రొఫెసర్ ప్యాట్రిక్, ప్రొఫెసర్ నవీన్ ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News