Thursday, December 19, 2024

రాష్ట్ర ప్రగతికి సహకరిస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.
– ప్రధాని మోడీ ట్వీట్ (ఎక్స్)

మోడీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖుల విషెస్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి అన్ని పార్టీల రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు. బెస్ట్ విషెస్ చెప్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు అంటూ ప్రధా ని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ’తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ప్రజల సర్కారు పని మొదలైంది : రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రుల బృందానికి శుభాభినందనలు. ఇక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని మొదలైంది. బంగారు తెలంగాణ కలను మేం సాకారం చేస్తాం. మేం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి మాట నిలుపుకుంటాం‘ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
రేవంత్, ఇతర మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు: హరీశ్ రావు
రేవంత్ రెడ్డికి బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ’రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
తన పదవీకాలంలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నా: బండి
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా‘ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
రేవంత్‌కు ఎపి సిఎం జగన్ అభినందనలు
ఎపి సిఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను‘ అంటూ సిఎం జగన్ ట్వీట్ చేశారు.
రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
సిఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి హార్దిక శుభాభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను‘ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, డిప్యూటీ సీఎంగా నియమితుడైన మల్లు భట్టి విక్రమార్కకు, నూతన మంత్రివర్గానికి, కాం గ్రెస్ శాసనసభాపక్షానికి కూడా చిరంజీవి విషెస్ తెలిపారు.
రేవంత్‌రెడ్డితో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది : పవన్ కల్యాణ్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను‘ అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
సిఎంగా రేవంత్ సక్సెస్ అవ్వాలి : చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్‌లో ఎనుముల రేవంత్ రెడ్డి అంటూ గౌరవంగా సంబోధించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు. తన పదవీకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్‌రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను‘ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News