Thursday, January 23, 2025

మా సత్తా ఏమిటో చాటుతాం!

- Advertisement -
- Advertisement -

ఉభయ కమ్యూనిస్టు నేతలు తమ్మినేని, కూనంనేని వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా కెసిఆర్‌ను దూషించమని విధానపరంగా తేల్చుకుంటామని వామపక్షాలు స్పష్టం చేశాయి. వచ్చే ఎన్నికల్లో శక్తికి మించి కృషి చేసి, కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని కమ్యూనిస్టు నేతలు కూనంనేని, తమ్మినేని అన్నారు. హైదరాబాద్ మగ్దం భవన్‌లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సమావేశం మంగళవారం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయాల్లో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు. మునుగోడులో బిజెపిని ఓడించేందుకే తాము బిఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామన్నారు. బిఆర్‌ఎస్‌తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని చెబుతున్నారు. సిపిఎం, సిపిఐ… రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయన్నారు.  తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమని. లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

వామపక్షాలకు సగం పైగా సీట్లలో ప్రభావం చూపే ఓటు బ్యాంకు ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపొందడం వెనుక సిపిఐ, సిపిఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిజెపి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తన ఒటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తమతో కలిసి వచ్చే వారితో తాము పని చేస్తామన్నారు. ఎన్‌డిఎ, ఇండియా కూటమిలకు సమదూరంలో ఉంటామని బిఆర్‌ఎస్ నేతలు చెప్పారన్నారు. అందుకే వారికి తాము ఇండియా కూటమిలో ఉండటం నచ్చలేదన్నారు. కేరళలో తమకు కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నాయని, కానీ బిజెపిని ఓడించేందుకు కలవాల్సి వచ్చిందన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని అనడం లేదని, కానీ బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ జాతీయస్థాయిలో ఉండాలన్నారు.
కలిసి పోటీకి లెఫ్ట్ పార్టీల నిర్ణయం..ఈ నెల 27 తర్వాత మరోసారి భేటీ
సిపిఐ, సిపిఎం నేతలు హైద్రాబాద్‌లో మంగళవారం సమావేశమయ్యారు. హైద్రాబాద్ సిపిఐ కార్యాలయానికి సిపిఎం నేతలు వచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం నేతలు చరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలు సిపిఐ నేతలతో సమావేశ మయ్యారు. మంగళవారం ఉదయం సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అదే సమయంలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. వేర్వేరుగా తమ కార్యాలయాల్లో సమావేశాలు ముగించుకున్న తర్వాత రెండు పార్టీల నేతలు సమావేశమ య్యారు.

రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ విషయమై 23న సిపిఐ రాష్ట్ర కార్యవర్గంలో, ఈ నెల 27న సిపిఎం రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీ తర్వాత రెండు పార్టీల నేతలు మరోసారి భేటీ కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సిపిఐ, సిపిఎంలు బిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంలకు ఒక్కో అసెంబ్లీ సీటు కేటాయించనున్నట్టుగా బిఆర్‌ఎస్ నుండి ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ విషయమై బిఆర్‌ఎస్‌తో చర్చలకు లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. కానీ, ఈ సమావేశం జరగలేదు. బిఆర్‌ఎస్ నాయకత్వం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో లెఫ్ట్ పార్టీల నేతలు మంగళవారం సమావేశమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News